సర్కార్ బడుల మూసివేతపై నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదిక ఆందోళన కలిగిస్తున్నది. ఆ నివేదిక ప్రకారం, గత దశాబ్దకాలంలో దేశవ్యాప్తంగా సుమారు 94,000 ప్రభుత్వ పాఠశాలలు, అంటే రోజుకు సగటున 25 బడులు మూతపడ్డాయి. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 2.26 కోట్లు తగ్గింది. మొత్తం విద్యార్థుల నమోదులో ప్రభుత్వ బడుల వాటా 2005లో 71%గా ఉండగా, 2024-25 నాటికి అది 49.24%కి పడిపోయింది. ఈ మూసివేతల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్ ముందువరుసలో ఉన్నాయి. ఎన్డీయే పాలనలో ఓవైపు సర్కారీ బడులు భారీస్థాయిలో మూసివేతకు గురవుతుంటే అదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 2.88 లక్షల నుంచి 3.31 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ బడులు, ప్రైవేట్ బడుల్లో మోదీ సర్కార్ మొగ్గు ఏవైపున ఉన్నదో ఈ పరిణామం చెప్పకనే చెప్తున్నది.
ఇటు మన రాష్ట్రంలోనూ సర్కారీ చదువుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడుతున్నట్టుగా తయారైంది. గత రెండున్నరేండ్ల కాలంలో నాలుగు వేల పాఠశాలలు మూసివేసిన కాంగ్రెస్ సర్కార్ మొత్తంగా సర్కారీ బోధన అస్తిత్వానికే ఎసరు తెచ్చే పనిలో నిమగ్నమైనట్టు సూచనలు వెలువడుతున్నాయి. సర్కార్ బడులను బాగుచేయడం చేతకాక తాళం పెట్టడమే తగిన పరిష్కారం అంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. రాష్ట్రంలోని సుమారు 27 వేల బడుల్లో 24 వేల వరకు మూసేయాలన్న ఆయన మదిలోని మహత్తరమైన ఆలోచనను ఆయన ఇటీవల బయటపెట్టడం తెలిసిందే. అంటే దాదాపు 90 శాతం బడులకు ఎగనామం పెట్టాలని చూస్తున్నారన్న మాట. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు చదువును చేరువ చేసే సర్కారీ బడులపై సీఎంకు ఉన్న ప్రేమ ఏపాటిదో దీన్ని బట్టి తెలుస్తున్నది. ఇదంతా సంస్కరణల పేరిట జరుగుతుండటం గమనార్హం. సర్కారీ బడుల మూసివేత ప్రైవేట్ బడులకు మేలు చేసేందుకు తప్ప మరేమీ లేదని రాష్ట్ర సర్కార్ తీరు తెలియజేస్తున్నది. ఇదంతా కప్పిపుచ్చుకునేందుకు ప్రత్యామ్నాయంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్ అంటూ బూటకపు మాటలతో కాలక్షేపం చేస్తున్నది.
ప్రపంచంలో దారిద్య్ర రేఖకు దిగువన జీవించే జనాభా గణనీయమైన స్థాయిలో ఉన్న మన దేశంలో సర్కారీ బడుల అవసరం లేదని ఎవరు చెప్పగలరు? 2019 నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం.. ముస్లిం, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సర్కారీ బడులు, అంటే ఉచిత చదువు అందుబాటులో లేకుండా పోతున్నది. ఇది కేవలం గణాంకాల సమస్య కాదు, సామాజిక న్యాయం క్షీణిస్తున్నదని అనడానికి ఇదొక సంకేతం. ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా పడేది బాలికలపైనే. సమీపంలోని పాఠశాల మూతబడితే ముందుగా ఆగిపోయేది అమ్మాయిల చదువే. పాఠశాలల విలీనీకరణ ముసుగులో మూసివేత జరుగుతున్నది. ఇక్కడ ప్రశ్న ఒకటే. ఈ పరిస్థితికి బాధ్యత ఎవరిది? విద్య అనేది సమాంతర జాబితాలో ఉండటం వల్ల పూర్తి బాధ్యత రాష్ర్టాలదేనని సంబంధిత మంత్రి లోక్సభలో దాటవేస్తారు. నిజానికి విద్యా హక్కు చట్టం కేంద్రం పరిధిలోనిదే. సమీపంలో పాఠశాల అనే ప్రాథమిక హక్కు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రం ఒకవైపు నిధుల కేటాయింపును జాతీయ విద్యావిధానం అమలుతో ముడిపెట్టి త్రిభాషా విధానాలను బలవంతంగా రాష్ర్టాలపై రుద్దుతున్నది. అంటే, జోక్యం చేసుకునే శక్తి కేంద్రం దగ్గరే ఉన్నదని అర్థం. అయితే అదే కేంద్రం పాఠశాలల మూసివేత, విలీనీకరణ వల్ల పేద పిల్లల విద్య దెబ్బతింటున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నది? అనేది ప్రశ్న. సర్కారీ బడుల క్షీణత సామాజిక అసమానతను మరింత విస్తృతం చేస్తుంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, అంతిమంగా విద్య.. ఒక హక్కు కాకుండా పోయే ప్రమాదం పొంచి ఉన్నది.