ఖమ్మం, ఆగస్టు 27 : సుప్రీం కోర్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు నిర్వహించారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఆదేశాల మేరకు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పార్టీ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా న్యాయమే గెలిచిందని, సుప్రీం కోర్టు సరైన తీర్పు ఇచ్చిందన్నారు. అనంతరం ‘జై బీఆర్ఎస్.. జై కేసీఆర్’ అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, తిరుమలాయపాలెం మండల పార్టీ అధ్యక్షుడు భాషబోయిన వీరన్న, బీఆర్ఎస్ యువజన విభాగం నగర ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్, ఉద్యమకారులు పగడాల నరేందర్, లింగనబోయిన సతీశ్, ఆసిఫ్, టెంకటి సందీప్, సద్దాం, సతీశ్, మంచానాయక్ పాల్గొన్నారు.
ఖమ్మం, ఆగస్టు 27 : ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చి న్యాయం పక్షాన నిలిచిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా దీనిని స్వాగతిస్తుందని, లికర్ పాలసీ కేసు అక్రమంగా పెట్టిన కేసు అని, ఇందులో ఎలాంటి నిజాలు లేవని మొదట్నుంచీ చెబుతూ వచ్చామన్నారు. కవితకు బెయిల్ మంజూరుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణను జీర్ణించుకోలేకే ఆయా పార్టీల నేతలు తలా తోకా లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను తప్పుబట్టేలా మాట్లాడుతున్న నేతలది కోర్టు ధికారణ నేరం కిందకే వస్తుందని, ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని తాతా మధు హెచ్చరించారు.
ఖమ్మం, ఆగస్టు 27 : ఢిల్లీ లికర్ పాలసీతో ఏ మాత్రం సంబంధం లేకున్నా తమ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ అక్రమంగా కేసు బనాయించి 168 రోజులు అన్యాయంగా జైల్లో వేయించడం తీవ్ర బాధాకరమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కవితకు బెయిల్ మంజూరైన సందర్భంగా మంగళవారం ఎంపీ వద్దిరాజు సుప్రీంకోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో బెయిల్ మంజూరు చేసి ఊరట కల్పించడం సంతోషకరమన్నారు. లికర్ పాలసీతో ఆమెకు ఎటువంటి ప్రమేయం లేదని, ఇందుకు సంబంధించి ఆమె వద్ద నుంచి ఎలాంటి పత్రాలు, ఆధారాలు లభించలేదన్నారు. కేసులో దమ్ములేదని అన్యాయంగా, అక్రమంగా బనాయించారని అన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న కవితను సామాన్య ఖైదీల మాదిరిగా చూడడం పట్ల న్యాయస్థానం కూడా తప్పుబట్టిందన్నారు. ఈ కేసులో కవిత కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్తారని ఆయన స్పష్టం చేశారు. కవితకు బెయిల్ మంజూరు కావడం పట్ల తెలంగాణ ప్రజలు, మహిళామణులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇందుకు సహకరించిన న్యాయవాదులు, ప్రెస్ అండ్ మీడియా, పార్టీ ప్రముఖులకు ఎంపీ వద్దిరాజు ధన్యవాదాలు తెలిపారు.
ఇల్లెందు రూరల్, ఆగస్టు 27 : పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ కవితపై అక్రమంగా కేసులు పెట్టారని, రాజకీయ కుట్రతో జైలుకు పంపినా కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ అన్నారు. సుప్రీం కోర్టు కవితకు బెయిల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం జగదాంబ సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహ వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మిలాఖత్ అయి.. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపేందుకు కుట్రలు పన్నుతున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడితే ఉద్యమాలు చేసేందుకు వెనుకాడబోమన్నారు. కార్యక్రమంలో ఉద్యమ నాయకులు సిలివేరి సత్యనారాయణ, దేవీలాల్‌నాయక్, భావ్‌సింగ్, జిల్లా నాయకులు ఎస్.రంగనాథ్, కౌన్సిలర్లు జేకే శ్రీను, సందా ప్రవీణ్, తోట లలిత, శారద, పద్మ, కోఆప్షన్ సభ్యుడు ఘాజీ, శీలం రమేశ్, అబ్దుల్ నభి, జబ్బార్, గిన్నారపు రాజేశ్, భూక్య సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 27 : ఎమ్మెల్సీ కవితపై బనాయించిన అక్రమ కేసులో న్యాయమే గెలిచిందని, సుప్రీం కోర్టు సరైన తీర్పు ఇచ్చిందని కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో కొత్తగూడెం పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులు చైర్పర్సన్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి.. స్వీట్లు పంచుకొని సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఇందుకు నిదర్శనమే కవిత అరెస్ట్ అని అన్నారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని అబాసుపాలు చేసేందుకే ఇన్ని కుట్రలు పన్నారన్నారు. ఏ పార్టీతో లాలూచీ పడాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అంబుల వేణుగోపాల్, ప్రసాద్‌బాబు, బీఆర్ఎస్ నేతలు తొగరు రాజశేఖర్, సంకుబాపన అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.