భద్రాద్రి కొత్తగూడెం, జూలై 16 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ బీఆర్ఎస్ నేతలను జిల్లా పోలీసులు గురువారం ముందస్తు అరెస్టులు చేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలోనే నేతల ఇళ్లలోకి వెళ్లి వారిని బయటకు తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ పోలీసు స్టేషన్లకు తరలించి మధ్యాహ్నం వరకు అక్కడే నిర్బంధించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి గురువారం భద్రాద్రి జిల్లాలో పర్యటించి అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టు సందర్శించేందుకు నిర్ణయించుకున్నారు. అయితే, సీతారామ ప్రాజెక్టు నీళ్లను మొదటగా భద్రాద్రి జిల్లా రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించేందుకు, కేసీఆర్ ఎంతో ముందుచూపుతో సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తే.. ఖమ్మానికి చెందిన ముగ్గురు మంత్రులు ఇప్పుడు ఈ సీతారామ ద్వారా గోదావరి జలాలను వారి ఖమ్మం జిల్లా ఎలా తీసుకెళ్తారని నిలదీసేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు.

మంత్రులు హెలికాప్టర్ ద్వారా తొలుత మణుగూరుకు చేరుకొని అక్కడి నుంచి అశ్వాపురం వెళ్లాల్సి ఉన్నందున వారిని మణుగూరులోనే నిలదీసేందుకు ‘చలో మణుగూరు’ పేరిట బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారమే పిలుపునిచ్చారు. దీంతో గురువారం మణుగూరు వెళ్లి మంత్రులను నిలదీసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతాయన్న అనుమానంతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని మండలాల్లోనూ గురువారం వేకువజాము నుంచే బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగూడెంలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

భద్రాద్రి జిల్లాకు వస్తున్న మంత్రులు జిల్లాకు ఏమి చేశారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దీర్ఘదృష్టితో భద్రాద్రి జిల్లాలో గోదావరి నదిపై సీతారామ ప్రాజెక్టును నిర్మించారని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖమ్మానికి చెందిన ముగ్గురు మంత్రులు ఈ సీతారామ జలాలను ముందుగా భద్రాద్రి జిల్లా రైతులకు ఇవ్వకుండా ఖమ్మానికి తరలించుకుపోతున్నారని అన్నారు. సీతారామ జలాలను ముందుగా భద్రాద్రి జిల్లా రైతులకే అందించాలని డిమాండ్ చేశారు.

ప్రజల పక్షాన నిలబడుతూ తమ గొంతును వినిపించిన ప్రతిసారీ ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతోందని విమర్శించారు. నిత్యం పోలీసులతో బీఆర్ఎస్ నేతల గొంతును అణిచివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల పక్షాన, జిల్లా రైతుల తరపున తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కాగా, అక్రమ అరెస్టులను ఖండిస్తూ పాల్వంచ పట్టణ పోలీసు స్టేషన్లో బీఆర్ఎస్ నేతలు తమ కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. అరెస్టు చేసిన ముఖ్య నేతల్లో ఇల్లెందులో ఉద్యమ నేత దిండిగాల రాజేందర్, పాల్వంచలో కిలారు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

ఉమ్మడి జిల్లాకు తలమానికమైన సీతారామ ప్రాజెక్టును సాకారం చేసిన దార్శనికుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆనాడు కాంగ్రెస్ సీఎంగా ఉన వైఎస్ఆర్ హయాంలో అవినీతి, దోపిడీకి గురై కునారిల్లిన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులకు ‘సీతారామ’తో పునరుజ్జీవం పోసి ప్రగతిపథంలో నడిపించిన ఘనత ఉద్యమ నేతకే దక్కుతుందని అన్నారు. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం గోదావరి జలాలను ఒడిసిపట్టి సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన సంగతి అందరికీ తెలుసని అన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కోపంతో పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకుల గొంతులను అణచివేయాలనే ప్రయత్నాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర సూచించారు. సీతారామ ప్రాజెక్టు నీళ్ల విషయంలో మంత్రులను ప్రశ్నిస్తారన్న భయంతో బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని గురువారం ఒక ప్రకటనలో ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్య కూడా ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా ఉందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అన్ని అణిచివేత చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
రైతులు, బీఆర్స్ నాయకులు నిలదీస్తారన్న భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల చాటున దాక్కుంటోందని, ఇది పిరికి ప్రభుత్వమని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు విమర్శించారు. దమ్మపేటలోని తన నివాసంలో పోలీసులు తనను హౌస్ అరెస్టు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వానిది ముమ్మాటికీ పిరికిపంద చర్యేనని అభివర్ణించారు. రైతుల సమస్యలపై ప్రశ్నిస్తారన్న వణుకు ప్రభుత్వానికి పట్టుకుందని, అందుకే అక్రమంగా అరెస్టులు చేయిస్తోందని స్పష్టం చేశారు. ఎన్నిసార్లు అరెస్టులు చేసినా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు.
భద్రాద్రి రైతులకు సీతారామ ద్వారా సాగునీరు ఇవ్వకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో సీతారామ ప్రాజెక్టును నిర్మించారని గుర్తుచేశారు. కానీ, నేటి కాంగ్రెస్ పాలకులు ఆ నీళ్లను మొదటగా భద్రాద్రి జిల్లాకు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. అశ్వాపురంలో ఉన్న మారెళ్లపాడు ప్రాజెక్టుకు కూడా నీరు ఇవ్వలేకపోయారని ఆరోపించారు. భద్రాద్రి జిల్లాలో వందల సంఖ్యలో చెరువులు ఉన్నప్పటికీ వాటిల్లో ఒక్క చెరువును కూడా సీతారామ జలాలతో నింపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు కనీసం అవగాహన లేకుండా మాట్లాడారని, రైతులు లేకుండా సమీక్ష చేసి వెళ్లారని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఎవరికి లాభమో ఒక్క రైతుతో కూడా చెప్పించలేకపోయారని దుయ్యబట్టారు. అమ్మగారిపల్లి సర్పంచ్‌ను కూడా వేదిక మీదకు పిలవకుండా అవమానించారని ఆరోపించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని కాకి లెక్కలు చెప్పారని ఆక్షేపించారు. ప్రాజెక్టుల గురించి కనీసం పరిజ్ఞానంలేని మంత్రులు ఏమీ చెప్పలేక గత ప్రభుత్వాన్ని విమర్శించి వెల్లడం విడ్డూరంగా ఉందన్నారు. భద్రాద్రికి సాగునీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.