Jadala Venkateshwarlu | కారేపల్లి, ఆగస్టు 14 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జడల వెంకటేశ్వర్లు (57) గుండెపోటుతో గురువారం రాత్రి కన్నుమూశారు. వెంకటేశ్వర్లు తన సొంత పనిమీద మహబూబాబాద్ వెళ్లగా.. ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. దీంతో ఆయనతోపాటు ఉన్నవారు వెంటనే వెంకటేశ్వర్లును ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు.
మృతుడు జడల వెంకటేశ్వర్లు తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. సింగరేణి మండలంలో బీఆర్ఎస్ పార్టీని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి ముందుకు తీసుకెళ్లడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. ఉద్యమకారుడు జడల వెంకటేశ్వర్లు మృతితో సింగరేణి మండల వ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లు పార్థివ దేహాన్ని మహబూబాబాద్ నుండి సింగరేణి బస్టాండ్ సెంటర్లో ఉన్న ఆయన నివాసానికి తీసుకురానున్నారు. శుక్రవారం కారేపల్లిలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సింగరేణి మండలంలో టిఆర్ఎస్ (బీఆర్ఎస్)పార్టీని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి ముందుకు తీసుకెళ్లడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో వెంకటేశ్వర్లపై అనేక కేసులు నమోదయ్యాయి. అయినా వెంకటేశ్వర్లు ఎటువంటి కేసులకు వెనుకాడని తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ధైర్యంగా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఉద్యమకారుడు జడల వెంకటేశ్వర్లు మృతితో సింగరేణి మండల వ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. బీఆర్ఎస్తోపాటు ఇతర అన్ని పార్టీల నాయకులు జడల వెంకటేశ్వర్లు అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుడు వెంకటేశ్వర్లుకు భార్య వసంతతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.