కారు.. ప్రచార జోరు సాగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పదికి పది స్థానాలు దక్కించుకునేందుకు వ్యూహంతో ముందుకెళ్తోంది. సీఎం కేసీఆర్ పది నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను ఇంటింటికీ తిరిగి వివరిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సైతం అభ్యర్థులతో కలిసి ప్రచార పర్వాన్ని ఉరకలెత్తిస్తున్నారు. అభ్యర్థులు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటూ విస్తృత ప్రచారం చేస్తుండగా.. వారి కుటుంబ సభ్యులు కూడా తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థి రాజకీయ నాయకుల మాటలకు దీటుగా సమాధానం చెబుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఎంత జరిగిందో చూపిస్తామంటూ సవాళ్లు విసురుతున్నారు.
ఖమ్మం, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఎన్నికల ప్రక్రియలో అన్నింటా అగ్రభాగాన నిలుస్తోంది. పకడ్బందీ ప్రణాళికలతో ప్రత్యర్థి పక్షాల అంచనాలను తలకిందులు చేస్తోంది. బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నామయమంటూ ప్రగల్భాలు పలికే కాంగ్రెస్.. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో కేవలం రెండు నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఎనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహులంతా తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకుంటుండడంతో శ్రేణుల్లో గందరగోళం సృష్టిస్తోంది. అభ్యర్థులే ఖరారు కాని కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రచారపర్వాన్ని అధికారికంగా ప్రారంభించలేదు. టికెట్ రేసులో ఉన్న నేతలు తప్ప కాంగ్రెస్‌లో ద్వితీయ స్థాయి నేతలు దూరంగా ఉంటున్నారు. అభ్యర్థులు ఖరారు కాకుండా ఆశావహుల తరఫున ప్రచారం చేయడానికి సీనియర్ నేతలు విముఖత చూపిస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఆగస్టు 21న పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన మరుక్షణం నుంచే వారు ప్రచారపర్వాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని పట్టణాలు, గ్రామాలను ఒక రౌండ్ చుట్టివచ్చారు. శ్రేణులకు అందుబాటులో ఉంటూ వారు ఆహ్వానించే ఆత్మీయ సమ్మేళనాలకు హాజరవుతున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి తోడ్పాటుగా ఉండేందుకు, పార్టీ శ్రేణులను సమన్వయం చేసేందుకు, ప్రచార వ్యూహాలను రూపొందించేందుకు, అభ్యర్థులకు సహాయ సహకారాలు అందించేందుకు.. ఎన్నికల నిర్వహణలో అపార అనుభవం కలిగిన ప్రజాప్రతినిధులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఇప్పటికే వారు ఆయా నియోజకవర్గాలపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మధిర నియోజకవర్గ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు ఖమ్మం నియోజకవర్గంలో వాడవాడలా పర్యటిస్తూనే.. తనను ఆహ్వానించి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. ప్రత్యర్థుల రాజకీయ జిమ్మిక్కులకు చెక్ పెడుతూ ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో తాను ఇన్చార్జ్గా ఉన్న మధిర నియోజకవర్గంపై పూర్తిస్థాయి దృష్టి సారించారు.
అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు గెలుపు కోసం తనదైన రీతిలో శ్రమిస్తున్నారు. ఇక కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేతలుగా పేరొందిన ప్రజాప్రతినిధులు సైతం రంగంలోనే ఉన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావులను తాము ఇన్‌చార్జ్‌లుగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ విజయం కోసం అభ్యర్థులతో కలిసి శ్రమిస్తున్నారు. ఇక.. పాలేరు, పినపాక నియోజకవర్గాలకు బీఆర్ఎస్ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులే ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.. ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులతో ఆత్మీయ సమావేశాలు, పోలింగ్ బూత్‌లవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్ తాతా మధు.. అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావుతో కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావులు సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక దఫా పర్యటనలు పూర్తి చేశారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని కల్పించారు. బీఆర్ఎస్పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని, అభిమానాన్ని ఎన్నికల్లో ఓట్ల రూపంలో మల్చుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని దిశానిర్దేశం చేశారు.
మధిరకు మరో ఇన్చార్జ్గా ఉన్న కొండబాల కోటేశ్వరరావు కూడా పార్టీ అభ్యర్థి లింగాల కమల్‌రాజుతో రోజవారీ రాజీకయ పరిస్థితులను సమీక్షిస్తూ అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విజయానికి తనదైన రీతిలో తోడ్పాటునందిస్తున్నారు. తన సంస్థలో పనిచేసే సత్తుపల్లి నియోజకవర్గవాసులతో ఎమ్మెల్యే సండ్రకు మద్దతుగా హైదరాబాద్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతను వివరించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అలాగే, అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ ఇన్చార్జ్ రాయల శేషగిరిరావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక, పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించారు. ఒకవైపు అభ్యర్థి కందాళ, మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో ముందు భాగాన ఉంటూ జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నారు.
ఈ నెల 27న పాలేరు నియోజకవర్గంలో నిర్వహించే ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ తొలి ఎన్నికల ప్రచార సభకు సీఎం కేసీఆర్ రానుండడంతో ఆ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి శరవేగంగా చేయిస్తున్నారు. కూసుమంచి మండలం జీళ్లచెరువు వద్ద ఉన్న సభాస్థలిని మంగళవారం ఆయన పరిశీలించారు. అలాగే, శాసనసభ నియోజకవర్గ అభ్యర్థులకు మరిన్ని సహాయ సహకారాలు అందించేందుకు పార్టీ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను పార్టీ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణకు పార్టీ అధిష్ఠానం అప్పగించింది. దీంతో ఆయన తన ఇతర సభ్యులతో కలిసి ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 27, నవంబర్ 1, 5 తేదీల్లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలేరు, ఇల్లెందు, సత్తుపల్లి, కొత్తగూడెం, ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటించనుండడంతో సభల విజయవంతంపై పార్టీ నేతలు పూర్తిస్థాయి దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో అభ్యర్థులను ప్రకటించే నాటికే బీఆర్ఎస్ తొలి విడత ఎన్నికల ప్రచారం పూర్తవుతోంది.