ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 6: ఎన్నికల ముందు అలవిగాని హామీలు ఇచ్చి, మాయమాటలతో పాలన సాగిస్తున్న మోసాల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గుదిమళ్ల, వెంకటగిరి గ్రామాల్లోని 10, 11, 12, 8, 9, 13 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ వారు.. సీపీఎం నేతలు నున్నా నాగేశ్వరరావు, బండి రమేశ్‌లతో కలిసి శుక్రవారం రోడ్ షో నిర్వహించారు.
అనంతరం ఆయా వార్డులలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సభలలో తాతా, కందాల మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ స్వతహాగా రైతు కావడంతోనే నిరంతరం రైతుల గురించి ఆలోచిస్తూ, వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేశారని, తద్వార రైతు బంధువయ్యాడని పేర్కొన్నారు. దేశంలోనే పంటల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ర్టాన్ని నెంబర్ వన్‌గా తయారు చేసి యావత్ దేశానికి అన్నపూర్ణగా మార్చారని గుర్తు చేశారు.
మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. రైతులను నట్టేట ముంచడంతోపాటు వ్యవసాయ రంగాన్ని అనతి కాలంలోనే నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. సమాజంలో ప్రతి ఒక్కరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పేరం వెంకటేశ్వర్లు, తిరుపతిరావు, చేకూరి సుధాకర్, సీపీఎం నాయకులు, వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు.