‘ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వ గెలుపుకోసం బాధ్యతగా పని చేయాల్సిన అవసరం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, నాయకులపైనా ఉన్నదని, వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని’ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఉమ్మడి జిల్లాకు చెందిన భద్రాచలానికి చెందిన నాయకుడు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా గురువారం జరిగిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడారు.
ఖమ్మం, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో భద్రాచలం నాయకుడు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్లోకి చేరిక సందర్భంగా గురువారం జరిగిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. బీఆర్ఎస్ గెలుపు కోసం బాధ్యతగా పని చేయాల్సిన అవసరం ఉమ్మడి జిల్లా ప్రజలపైనా, నాయకులపైనా ఉందని అన్నారు. భద్రాద్రి జిల్లాలోని గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
మాజీ ఎంపీ పొంగులేటి కీలక అనుచరుడిగా ఉన్న భద్రాచలానికి చెందిన తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్లో చేరడంతో ఆయన వర్గీయుల్లో సంచలనానికి దారి తీసిందని అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఉమ్మడి జిల్లా ప్రజలు నీరాజనాలు పలుకుతుండడంతో వెంకట్రావు పునరాలోచనలో పడ్డారని అన్నారు. ఆయన బాటలోనే ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు నడిచే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాళోతు కవిత, ఎమ్మెల్సీలు తాతా మధు, సిరికొండ మధుసూదనాచారి, శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ నాయకుడు బొమ్మెర రామూర్తి పాల్గొన్నారు.
కాంగ్రెస్ బెంబేలు..
మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తీసుకున్న నిర్ణయాలతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు బెంబేలెత్తుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరించింది. దీంతోపాటు రానున్న ఎన్నికల్లో రెండు జిల్లాల్లోని అన్ని స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నికలకు మూడు నెలల సమయమే ఉండడంతో కాంగ్రెస్‌కు చెందిన కీలక నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
మళ్లీ బీఆర్ఎస్లోకి తెల్లం వెంకట్రావు
భద్రాచలం, ఆగస్టు 17: బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఆయన సోదరి, దుమ్ముగూడెం జడ్పీటీసీ అయిన తెల్లం సీతమ్మ, పొంగులేటి అనుచరుడైన ఎండీ నవాబ్ కూడా వెంకట్రావు వెంట బీఆర్ఎస్లోకి వచ్చారు. వీరితోపాటు చర్ల, దుమ్ముగూడెం, పినపాక, భద్రాచలం మండలాలకు చెందిన పలువురు నాయకులు కూడా హైదరాబాద్‌లో బీఆర్ఎస్లో చేరారు.