తిరువనంతపురం, ఫిబ్రవరి 14: తాను మరణిస్తూ కూడా మరి కొందరికి తన అవయవాల దానం ద్వారా ప్రాణదాతగా మారింది కేరళలోని 10 నెలల చిన్నారి. పథనంతిట్ట జిల్లా మల్లప్పల్లికి చెందిన 10 నెలల అలిన్ షెరిన్ అబ్రహం ఒక రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమె అవయవాలను దానం చేయాలనే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆమె కాలేయం, గుండె కవాటాలు, మూత్ర పిండాలను దానం చేయగా, డాక్టర్లు ఆ చిన్నారి కిడ్నీలను తిరువనంతపురంలో చికిత్స పొందుతున్న 10 ఏండ్ల చిన్నారికి వెంటనే అమర్చారు. దీంతో కేరళలో అవయవ దానం చేసిన అతి పిన్న వయస్కురాలిగా అలిన్ షెరిన్ నిలిచింది. చిన్నారి తల్లిదండ్రులను కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి అభినందించారు. చిన్నారి మృతికి సంతాపం ప్రకటించిన ఆమె, ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా ఆ చిన్నారి తల్లిదండ్రుల నిర్ణయాన్ని ఎంతో ప్రశంసించారు.