ముంబై, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ముంబైలో మెట్రో ప్రాజెక్టు పనుల సమయంలో భద్రత సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. శనివారం ములుండ్ (పశ్చిమ)లోని ఎల్బిఎస్ రోడ్డులో మెట్రో స్తంభంపై నిర్మాణంలో ఉన్న పిట్ట గోడలోని కొంత భాగం కదులుతున్న ఆటోరిక్షాపై కూలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. మెట్రో వంతెన నిర్మాణంలో 100 శాతం నిర్లక్ష్యం జరిగిందని, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై మేయర్ రీతు తావ్డే హెచ్చరించారు. ఘటనా స్థలాన్ని మేయర్ సందర్శించారు. ఈ ఘటనలో ఆటో రిక్షా పూర్తిగా ధ్వంసం కాగా మరో రెండు, మూడు ఆటోలు, ఒక కారు కూడా ధ్వంసమయ్యాయి.