– భట్టుపల్లిలో బీఆర్ఎస్ గ్రామ శాఖ కార్యాలయం ప్రారంభం
కరకగూడెం, మే 15 : రాష్ట్రంలో తిరుగులేని, బలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ అవతరించిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అందుకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. శుక్రవారం కరకగూడెం మండలం భట్టుపల్లి పంచాయతీలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కార్యాలయాన్ని మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ప్రారంభించారు. పార్టీ ఆఫీసు చేరుకున్న రేగా ముందుగా అక్కడ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయంలోకి వెళ్లారు. పార్టీ ఆఫీస్లో రేగా ప్రత్యేక పూజలు చేసి అనంతరం మాట్లాడారు. ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్నే చూడలని అనుకుంటున్నారని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ఇంటింటికి చేరాయని దాంతో ప్రతి ఇంటికి సొంత పార్టీయే అన్నంతగా ఆదరణ లభిస్తుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా రైతుల పరిస్థితిని మరీ దయానీయంగా మార్చరని మండిపడ్డారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పెట్టుబడి సాయం అందిచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ధాన్యంకొనుగోళ్లలో సైతం జాప్యం జరుగుతుండటంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రజల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు తెలుసుకంటూ పార్టీ బలోపేతాని కృషి చేయాలన్నారు. ముందుంది అన్ని మంచి రోజులే అని కార్యకర్తల్లో రేగా జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, నాయకులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, పోగుల ఎల్ల గౌడ్, కొమరం రాంబాబు, చిరంజీవి, సందీప్, రాము, శ్రీధర్, సతీష్, ఆదినారాయణ, సత్యనారాయణ, వెంకన్న, విష్ణు, భాస్కర్, వీరన్న, లింగయ్య, మధు, శ్రీను, నాగమణి, కాంతారావు, సాంబశివరావు, శంకరయ్య, రాంబాబు, లక్ష్మీనారాయణ, ప్రభాకర్, శ్రీదేవి, పాల్గొన్నారు.

రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ : రేగా కాంతారావు