గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అప్రతిహత విజయాన్ని సాధించి అధికార కాంగ్రెస్ పార్టీని ఖంగు తినిపించింది. మూడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ మద్దతుదారులతో హోరాహోరీ పోరు కొనసాగించి ఘనవిజయం సాధించారు. ఈ పంచాయతీ ఎన్నికలతో జిల్లాలోని గ్రామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత స్పష్టమైంది. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకపోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వంటి కారణాలతో గ్రామీణ ఓటర్లు అధికార కాంగ్రెస్ పార్టీకి తమదైన తీర్పునిచ్చారు. ఖమ్మం జిల్లా చైతన్యాన్ని మరోసారి
చాటి చెప్పారు.
ఖమ్మం, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలాచోట్ల బీఆర్ఎస్, సీపీఎం కలిసి పొత్తు పెట్టున్నాయి. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగ్గా ప్రతి విడతలోనూ బీఆర్ఎస్, సీపీఎం కూటమి తమ సత్తాను చాటింది. ఈ పొత్తు ఇరుపార్టీలకూ రాజకీయంగా కలిసి వచ్చింది. గ్రామాల్లో ఆయా పార్టీల పట్టు ఎన్నికల్లో స్పష్టమైంది. అనేక గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం అభ్యర్థులు పలు పంచాయతీలను కైవసం చేసుకున్నారు. అలాగే, సీపీఎం మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా అనేక పంచాయతీలను గెలుచుకున్నారు.
ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులకు ఓటర్లు షాక్ ఇచ్చారు. మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, సీపీఎం మద్దతుదారులను ప్రజలు ఆదరించారు. అద్భుత విజయాలను అందించారు. ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పది మేజర్ పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకోవడం, ఖమ్మం రూరల్ మండలంలో రెండు గ్రామాల్లో కాంగ్రెస్ అసలు ఖాతా తెరవకపోవడం వంటివి అధికార కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకతను స్పష్టం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అలాగే, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మేజర్ పంచాయతీని సీపీఎం గెలుచుకోవడంతోపాటు మండలంలో కీలక స్థానాలను సీపీఎం, బీఆర్ఎస్ కైవసం చేసుకున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ హవాకు బ్రేక్ పడినట్లయింది. అలాగే, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ మద్దతుదారులు 11 మందిని గెలిపించి ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు.
ఇక, సత్తుపల్లి నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ తమ సత్తా చాటింది. ఇక్కడ మూడు మండలాల్లో కాంగ్రెస్ కన్నా అధిక స్థానాలను సాధించడం ద్వారా ప్రజల్లో తమ బలాన్ని నిరూపించినట్లయింది. అలాగే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత మండలమైన కల్లూరులో కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ 12 స్థానాలను కైవసం చేసుకోగా.. స్వతంత్ర అభ్యర్థులు నాలుగు స్థానాలను గెలుపొందారు. అలాగే, చింతకాని, బోనకల్లు, ముదిగొండ, మధిర మండలాల్లో బీఆర్ఎస్, సీపీఎం కూటమి అనేక విజయాలు సాధించింది. కల్లూరు, వేంసూరు, సత్తుపల్లి మండలాల్లోనూ బీఆర్ఎస్ తన ఆధిక్యతను చాటుకుంది. ఖమ్మం రూరల్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీ కన్నా ఒక స్థానాన్ని అధికంగా గెలిచి విజయదుందుభి మోగించింది.
ఖమ్మం జిల్లాలో మొత్తం 571 పంచాయతీలున్నాయి. వీటిల్లో మూడు విడతల్లో కలిపి మొత్తం 65 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 506 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో ఏన్కూరు మండలం నూకాలంపాడు పంచాయతీ ఎస్టీలకు రిజర్వు కావడం, అక్కడ ఎస్టీలు లేకపోవడంతో నామినేషన్ దాఖలు కాలేదు. ఇదే మండలంలోని నాలుగు పంచాయతీల ప్రజలతోపాటు పెనుబల్లి మండలం గౌరారం ప్రజలు తమ గ్రామాల రిజర్వేషన్లు మార్చాలని కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో ఆయా గ్రామాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఆరు గ్రామాలుపోగా మిగిలిన 500 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిల్లో 150కి పైగా గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకోగా.. బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసిన సీపీఎం 25 స్థానాలను గెలుచుకుంది. బీఆర్ఎస్ పలు పంచాయతీలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. సీపీఎంకి సైతం పలు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. భద్రాద్రి జిల్లాలోనూ అధికార కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ మద్దతుదారులు గట్టి షాక్ ఇచ్చారు. అక్కడ కూడా బీఆర్ఎస్, సీపీఎం కూటమి తన సత్తాను చాటింది.
గులాబీ నేతల కీలకపాత్ర..
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుదారులు ఘన విజయం సాధించడంలో గులాబీ నేతలు కీలకపాత్ర పోషించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, చంద్రావతి, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, పార్టీ నాయకులు బానోత్ మంజుల, రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ తదితరులు బీఆర్ఎస్ మద్దతుదారులు ఘన విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. విస్తృత ప్రచారం చేశారు.