నియోజకవర్గాల్లోని పట్టణాలు, పల్లెలు, వార్డుల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రోడ్‌షోలు, ఆత్మీయ సభలు, సమావేశాల్లో అభ్యర్థులకు బొట్టు పెట్టి ఆశీర్వదిస్తూ.. స్వాగతం పలుకుతున్నారు. ‘మేమున్నామంటూ.. మా ఓటు కారు గుర్తుకే వేస్తామంటూ’ ప్రజలు నినదిస్తూ మరీ ప్రచారంలో కాలు కదుపుతున్నారు. బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ ప్రగతిని వివరించారు.
మ్యానిఫెస్టోలోని అంశాల గురించి ఓటర్లకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తల్లాడ మండలంలో సండ్ర గెలుపు కోసం తనయులు ప్రచారం చేశారు. మధిర పట్టణంలో కమల్‌రాజును గెలిపించాలంటూ అతని కుమార్తె అభిజ్ఞ, పాలేరులో కందాళను మరోసారి ఆశీర్వదించండి అంటూ ఆయన కుమార్తెలు దీప్తి, దీపికలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వనమా గెలుపును ఆకాంక్షిస్తూ ఆయన మనుమరాళ్లు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.