కారేపల్లి, డిసెంబర్ 05 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మంజుల మదన్ లాల్ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన సింగరేణి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరిపాలన సౌలభ్యం, గ్రామాల అభివృద్ధి కోసం ఆనాడు వైరా ఎమ్మెల్యేగా ఉన్న బానోతు మదన్‌లాల్ సింగరేణి మండలంలో ఎక్కువ గ్రామ పంచాయతీలు ఏర్పాటు అయ్యేందుకు కృషి చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. మళ్లీ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుందన్నారు. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరిని గెలిపించుకుని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జడల వసంత, ఆ పార్టీ నాయకులు దొంకేన రవీందర్, గంగరబోయిన సత్యం, మురళి, జడల కళ్యాణ్, సోమందుల నాగరాజు, ఖలీల్ ఉల్లా ఖాన్ పాల్గొన్నారు.

Karepally : బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి : బానోత్ మంజుల మదన్‌లాల్