ఖమ్మం, నవంబర్ 22: ఖమ్మం నియోజకవర్గాన్ని తాను అన్ని విధాలా అభివృద్ధి చేశానని, తనను మరోసారి గెలిస్తే మరింతగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. తాను ఇంతలా శ్రమించి ఖమ్మానికి కొత్త రూపు తెస్తే.. ఇప్పుడు మరొకరొచ్చి ఇదంతా తానే చేశానని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఖమ్మం నగరంలో బుధవారం పర్యటించిన ఆయన.. 23, 39, 41, 58 డివిజన్లలో రోడ్‌షోలు నిర్వహించారు. ముందుగా 41వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కర్నాటి కృష్ణ ఆధ్వర్యంలో మహిళలు మంత్రి పువ్వాడకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో ఖమ్మం అభివృద్ధికి రూ.3 వేల కోట్లు తెచ్చానని గుర్తుచేశారు. ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ.30 వేల కోట్లు తెచ్చి నగరాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్ది బెస్ట్ సిటీగా చేస్తానని అన్నారు.
ఖమ్మానికి మహర్దశ పడుతుందని ఇంతకుమునుపు ఎవ్వరూ ఊహించలేదని అన్నారు. కానీ తాను మాత్రం నిరంతరం శ్రమించి ఖమ్మానికి సరికొత్త రూపాన్ని తెచ్చానని వివరించారు. నిత్యం ట్రాఫిక్ జామ్‌లు అయ్యే నగరాన్ని ఇప్పుడు ట్రాఫిక్ ఫ్రీగా తీర్చిదిద్దానని అన్నారు. ఒకప్పుడు దుర్భరంగా ఉన్న ఖమ్మాన్ని ఇప్పటికే సుందర నగరంగా మార్చానని గుర్తుచేశారు. మన ముస్తాఫానగర్ జంక్షన్‌ని ముస్తాబు చేశానన్నారు. ధంసలాపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ వంటి వాటితో నేడు ఈ ప్రాంతం ధగధగ మెరిసేలా చేశానన్నారు. నగరంలో 75 వేల నల్లా కనెక్షన్లతో ఇంటింటికీ శుద్ధజలాలు అందిస్తున్నామన్నారు. వన్‌టౌన్ ప్రాంతమంటే తనకు గుండె కాయ లాంటిదని, ఎంతో ముఖ్యమైనదని అన్నారు. అందుకే దీన్ని మరింతగా ముస్తాబు చేశానని అన్నారు. అందుకని కారు గుర్తుకు ఓటు వేసి తనకు అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. అప్ప ట్లో ఓడిన తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ పిలిచి మంత్రి పదవిని ఇచ్చారని, అయితే కేసీఆర్‌నే తుమ్మల మోసం చేశారని ఆరోపించారు.