బోనకల్లు, నవంబర్ 26 : నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లే స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మళ్లీ మనకొద్దని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. ఆయన వల్ల మన నియోజకవర్గానికి పైసా ఉపయోగం లేదని, ఆయన ఇక్కడి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి శూన్యమని విమర్శించారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే నియోజకవర్గంలో మరింత ప్రగతి తథ్యమని స్పష్టం చేశారు. బోనకల్లు మండలంలో ఆదివారం పర్యటించిన ఆయన.. ముష్టికుంట్ల గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు ఆయనకు బొట్టు పెట్టి హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ..
ప్రజలందరూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. అందుకోసం మధిర నియోజకవ్గం నుంచి తనకు అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. నిత్యం నియోజకవర్గంలోనే ఉంటుంటున్న తాను ఇక్కడి ప్రజల కష్టసుఖాల్లో తోడునీడగా నిలుస్తున్నానని గుర్తుచేశారు. ఇక్కడి నుంచి గెలిచిన భట్టి విక్రమార్క.. కేవలం ఓట్ల సమయంలో తప్ప మరెప్పుడు ఈ నియోజకవర్గంలో కన్పించడని, గడిచిన మూడు ఎన్నికల్లో ఎప్పుడు గెలిచినా తదుపరి ఎన్నికలప్పుడే ఆయన ఇక్కడికి వస్తాయరని విమర్శించారు. అభ్యర్థి కమల్రాజు కుమార్తె అభిజ్ఞ, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బంధం శ్రీనివాసరావు, మోదుగుల నాగేశ్వరరావు, షేక్ బీజాన్బీ, షేక్ హుస్సేన్, పండుగ సీతారాములు, షేక్ రఫీ, షేక్ నజీర్, ధారగాని నాగేశ్వరరావు, చల్ది ప్రసాద్, నాగేశ్వరరావు, రుక్సానాబేగం, ధారగాని వెంకటరమణ, దొడ్డా నాగేశ్వరరావు, దొప్పా కృష్ణ, షేక్ రఫీ పాల్గొన్నారు.