ముంబై, ఫిబ్రవరి 16: దేశీయ రిటైల్ మార్కెట్.. 2035నాటికి రూ.210-215 లక్షల కోట్లకు చేరవచ్చని సోమవారం విడుదలైన ఓ నివేదిక అంచనా వేసింది. 2025లో మార్కెట్ విలువ రూ.90-95 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నది. ‘విన్నింగ్ కోడ్స్ ఫర్ రిటైల్ 2035: క్యాప్చరింగ్ ది రూ.200 ట్రిలియన్ ప్రైజ్’ పేరిట బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), భారతీయ రిటైలర్ల సంఘం (ఆర్ఏఐ) సంయుక్తంగా రిటైల్ లీడర్షిప్ సమ్మిట్ 2026లో ఈ రిపోర్టును విడుదల చేశాయి.
కన్జ్యూమర్ ఎంగేజ్మెంట్, ఆపరేటింగ్ మాడల్స్, ప్రతిభపరంగా జరుగుతున్న నిర్మాణాత్మక మార్పులను స్వాగతించే రిటైలర్లు.. రూ.200 లక్షల కోట్ల రిటైల్ మార్కెట్ పయనంలో కీలకంగా మారుతారని బీసీజీ, ఆర్ఏఐ పేర్కొన్నాయి.
ఇక షాపింగ్ ప్రపంచంలో డిజిటలైజేషన్ కూడా వేగంగా జరుగుతున్నదని, కృత్రిమ మేధస్సు (ఏఐ).. రిటైల్ సంస్థ రీడిజైన్‌లో ఓ ఉత్ప్రేరకంగా ఉండగలదని తెలిపాయి. ఈ క్రమంలోనే భవిష్యత్తులో అటు సంప్రదాయ రిటైల్ మార్కెట్లోగానీ, ఇటు ఆన్లైన్ రిటైల్ మార్కెట్లోగానీ ఏఐ, టెక్నాలజీలను అందిపుచ్చుకున్నవారే విజేతలుగా నిలుస్తారని బీసీజీ ఎండీ అభీక్ సింఘీ స్పష్టం చేశారు. మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా కస్టమర్ల ఆలోచనా సరళి మారుతున్నదని, దాన్ని ఎప్పటికప్పుడు వ్యాపారులు అందిపుచ్చుకుంటేనే వృద్ధికి వీలుంటుందన్నారు. అలాగే రవాణాపరమైన అంశాల్లోనూ టెక్నాలజీ ఆధారిత సేవలను పొందితే రిటైలర్లకు మరింత లాభదాయకమని సూచించారు.