సిటీబ్యూరో : దక్షిణ డిస్కంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వివాదం వినియోగదారులకు, అధికారులకు తలనొప్పిగా మారింది. ఓసీ లేని భవనాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేది లేదంటూ టీజీఎస్పీడీసీఎల్ గత సంవత్సరమే ప్రకటించింది. దీనికారణంగా ముఖ్యంగా హైదరాబాద్‌లో వేలాది మంది గృహ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినియోగదారుల సంఘాలు పేర్కొంటున్నాయి. గతంలో ఇలాంటి భవనాలకు కేటగిరీ 8 కింద అధిక టారిఫ్‌తో విద్యుత్ సరఫరా చేసే విధానాన్ని అమలు చేసినట్లు అధికారులు చెప్పారు. అయితే ఈ విషయంలో సీఎండీ జితేష్ వీ పాటిల్ మౌఖికంగా ఓసీ విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పినప్పటికీ అధికారులు మాత్రం తమకెందుకొచ్చిన తలనొప్పి అనుకుంటూ ఉత్తర్వులు వస్తే తప్ప ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ అంతర్గతంగా చెప్పుకుంటున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉంటే ఇటీవల సీఎండీ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఓసీకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతో ఆ మాటలను మౌఖిక ఆదేశాలుగా పరిగణించాలని కొందరు అధికారులు, జీవో వస్తే తప్ప ఆ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దని మరికొందరు తర్జనభర్జన పడుతున్నారు. ఓసీ లేకున్నా అదనపు టారిఫ్‌తో విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్దమయ్యారంటూ సమాచారం బయటకు రావడంతో గ్రేటర్ వ్యాప్తంగా కాంట్రాక్టర్లు, వినియోగదారులు తమకు రిలీఫ్ లభించిందని ఆనందపడ్డారు.
కానీ ఇవి కేవలం మౌఖికంగానే జరిగింది తప్ప ఎక్కడా కాగితాలపై లేదని, ఈ విషయంలో తాము నిర్ణయం తీసుకోలేమంటూ స్థానిక అధికారులు స్పష్టంగా చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీల నుంచి ఓసీలు కావాలని వెళ్తే పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, కొన్ని చిన్నచిన్న ఇళ్లకు పర్మిషన్లో చూపినట్లుగా కట్టడం కుదరదు కాబట్టి ఓసీ విషయంలో సర్దుబాటు ఉండాలని కోరినా విద్యుత్ అధికారులు తమకు కనెక్షన్లు ఇవ్వడం లేదని కొందరు వినియోగదారులు వాపోయారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఓసీ లేదంటూ విద్యుత్ సరఫరా నిలిపివేయడం, కొత్తగా కనెక్షన్లు ఇవ్వకపోవడం తీవ్ర సమస్యగా మారింది. గత కొన్నినెలలుగా వేల సంఖ్యలో విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తులు దక్షిణడిస్కంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఓసీ విషయంలో ఇంత పట్టుదల అవసరం లేదంటూ ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిళ్లు తెస్తుంటే గత అనుభవాల నేపథ్యంలో తమకెక్కడ మెమోలు ఇస్తారోనంటూ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో వాటి జోలికే వెళ్లడం లేదు. ఒకట్రెండు చోట్ల ఓసీ లేకుండా భవనాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినా మళ్లీ వాటిని వెనక్కు తెచ్చిన పరిస్థితులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ నుంచి జారీ కావలసిన ఓసీ విషయంలో దక్షిణ డిస్కంకు అంత పట్టింపు ఎందుకని, తాము వ్యాపారసంస్థగా కరెంట్‌ను అమ్ముకోవాలని, కానీ ఓసీ పేరుతో సంస్థకు భారీస్థాయిలో నష్టాలు తెస్తున్నారంటూ కొందరు సీనియర్ ఇంజనీర్లు చెబుతున్నారు.
గతంలోనూ ఓసీ లేని భవనాలకు విద్యుత్ సరఫరా ఇవ్వడంపై న్యాయస్థానాలు ప్రశ్నిస్తే సంస్థ ఆర్థికలావాదేవీలు, స్వయంప్రతిపత్తి, దరఖాస్తుదారుల అవసరాలను ప్రామాణికంగా తీసుకుని నాటి యాజమాన్యం కోర్టుకు స్పష్టత ఇచ్చింది. అయితే ఇటీవల కోర్టులు తాత్కాలిక సర్వీసుల శాశ్వత కొనసాగింపుపై ప్రశ్నించినప్పటి నుంచి ఓసీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో కోర్టు నుంచి స్టే తెచ్చి కనెక్షన్లు తీసుకున్నవారి జాబితా కూడా తయారుచేయాలంటూ డిస్కం ఉన్నతాధికారులు సిద్ధమవుతున్న నేపథ్యంలో సుమారు 5లక్షల మందిపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంద ని సీనియర్ ఇంజినీర్ ఒకరు చెప్పారు. ప్రభుత్వంకానీ, విద్యుత్ సంస్థలు కానీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదని ఆయన పేర్కొన్నారు.
అన్ని అనుమతులతో నిబంధనల ప్రకా రం నిర్మించిన భవనాలకు సైతం ఓసీ కావాలంటే గతంలో సులువుగా వచ్చేదని, కానీ ఎస్పీడీసీఎల్ లింక్ పెరిగినప్పటి నుంచి ఓసీకి డిమాండ్ పెరిగిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు ఓసీ నిబంధన క్షేత్రస్థాయి అధికారులకు సమస్యగా మారుతోంది. స్థానిక నాయకులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు తమ దగ్గరి వారికోసం కనెక్షన్ల గురించి ఫోన్లు చేస్తూ ఒత్తిడి చేస్తుంటే సమాధానం చెప్పలేక, కనెక్షన్ ఇవ్వలేక సతమతమవుతున్నారు. ఓసీ తప్పనిసరి చేయ డం ఆహ్వానించదగినదే అయినా అది మున్సిపల్ శాఖకు సంబంధించిన వ్యవహారం కాగా ఈ విషయంలో డిస్కం అధికారులు ఉత్సాహం చూపించడం ఎందుకని అధికారులే ప్రశ్నిస్తున్నారు.