రాజన్న సిరిసిల్ల, జూలై 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలోనే కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే మార్గానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఉద్యమంతోపాటు ఇతర కారణాలతో అప్పుడు రైల్వే పనులు పట్టాలు ఎక్కలేకపోయింది. 2014లో కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రైల్వే లైన్ సాధించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అప్పటి ఎంపీ వినోద్‌కుమార్, అప్పటి మంత్రి కేటీఆర్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేసి, కేంద్ర ప్రభుత్వం షరతులను ఒప్పుకొని ఈ ప్రాజెక్టును సాధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఖర్చులు భరించడానికి అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రైల్వేలైన్‌కు అయ్యే ఖర్చులో 33 శాతం నిధులు, వంద శాతం భూసేకరణ చేసి అందించడానికి కేసీఆర్ సర్కార్ అంగీకరించడంతో రైల్వే లైన్ పనులకు పునాది పడింది. 2016 ఆగస్టు 7న ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేశారు. దీంతో కార్మిక, ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరబోతున్నది.
రోడ్డుమార్గం తప్ప ఇతర మార్గాలు లేని కార్మిక క్షేత్రానికి రైలు ప్రయాణ యోగం కలుగనున్నది. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ సిద్దిపేట వరకు పూర్తయిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం వరకు రైల్వే లైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌లో రైల్వే స్టేషన్ పూర్తయింది. గతేడాది సిద్దిపేటలోని నర్సాపూర్ రైల్వేస్టేషన్ నుంచి మందపల్లి, పెద్దకొడూర్, చిన్నకొడూర్, మాచాపూర్ మీదుగా ట్రయల్ రన్ నిర్వహించారు. తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెలో సిరిసిల్ల రైల్వే స్టేషన్ పనులు, గోపాలరావుపల్లి శివారులోని మానేరువాగుపై రైల్వే బ్రిడ్జి పనులు చేపడుతున్నారు. జిల్లాలో రైల్వే లైన్ పూర్తయితే సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ, వ్యాపారం విస్తరించడంతోపాటు మరింత అభివృద్ధికి దోహదపడనున్నది. సిరిసిల్ల నుంచి వేములవాడలోని నాంపల్లి, బోయినపల్లి మండలం మీదుగా కొత్తపల్లి వరకు రైల్వేలైన్ పూర్తయితే రాజన్న సన్నిధికి వచ్చే భక్తులు నేరుగా వేములవాడకు చేరుకోవచ్చు. గడిచిన మూడేండ్లలో రైల్వేలైన్ పనులు బీఆర్ఎస్ హయాంలోనే చేసినవే కొనసాగిస్తున్నారని, ప్రస్తుతం ఆశించిన మేరకు ఈ లైన్ కొనసాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ మార్గం 162 కిలోమీటర్ల మేర ఉంటుంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి నుంచి మెదక్ జిల్లా మనోహరాబాద్ వరకు ఈ రైల్వే లైన్ ఉంటుంది. రూ.1,162 కోట్ల అంచనాతో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం రూ.350 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్లో రూ.165 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు మనోహరాబాద్-సిద్దిపేట వరకు రైల్వేలైన్ పూర్తయింది. సిద్దిపేట నుంచి సిరిసిల్ల, వేములవాడ మీదుగా కొత్తపల్లి వరకు లైన్ పూర్తిచేయాల్సి ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17 గ్రామాల్లో 740 ఎకరాల భూసేకరణ పూర్తయింది. రైల్వేలైన్ పట్టాలు, అండర్ టన్నెల్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌లో రైల్వే స్టేషన్ బుకింగ్‌కౌంటర్ భవనం పూర్తయింది. తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లిలో సిరిసిల్ల రైల్వేస్టేషన్ పనులు కొనసాగుతున్నాయి.