అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని హైకోర్టు ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది..అనధికారిక నిర్మాణాలు చేపట్టిన వారు మూల్యం చెల్లించాల్సిందేనని, ఇందుకోసం భారీ జరిమానా విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది… అత్యున్నత న్యాయస్థానం స్పందించినా.. టౌన్ ప్లానింగ్ అధికారుల్లో చలనం కరువైంది. నిబంధనలను కాగితాలకే పరిమితమవుతూ..అక్రమ నిర్మాణాల నుంచి అందినంత దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఫలితంగా అనుమతులు తక్కువ..అంతస్తులు ఎక్కువ..కాసులు ఇచ్చుకుంటే చాలు..ఏమైనా చేసుకోవచ్చు అనే చందంగా మారింది మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలోని టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరు. అక్రమ నిర్మాణాలపై బాధ్యతాయుత పౌరులు అధికారుల దృష్టికి తీసుకెళ్తే..‘మా దగ్గర సిబ్బంది లేరు..ఏం చేయాలి?’ అంటూ సమాధానాలు ఇస్తుండడం గమనార్హం. భారీగా ముడుపులు దండుకొని క్షేత్రస్థాయి నిఘాను గాలికి వదిలేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
– సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ)/మల్కాజిగిరి
మీర్జాలగూడ నుంచి నేరేడ్మెట్ వరకు మాస్టర్‌ప్లాన్ రోడ్డు ఉంది. అయితే ఈ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగానే నిర్మాణాలు చేపడుతున్నారు. ఆయా రోడ్డు ప్రాంతాల్లో కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్న మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టడంలేదు. మీర్జాలగూడ, నేరేడ్మెట్ మూడుగుళ్ల ప్రాంతాల్లో అనుమతులు లేకుండా కమర్షియల్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కానీ అధికారులు వాటిపై చర్యలు చేపట్టలేదు. అనుమతులు లేని నిర్మాణాలకు ట్రేడ్ లైసెన్స్‌ను మంజూరు చేయకుండా ఉండాల్సిన అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. ఓల్డ్ సఫిల్‌గూడలో బహుళ అంతస్తులు నిర్మించి, ఓసీ విడుదల చేయగానే ఆయా నిర్మాణాలలో నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ షెట్టర్లు వేస్తున్నారు.
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని జ్యోతినగర్, పీవీఎన్‌కాలనీలో అనుమతులకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. జ్యోతినగర్‌లో అనుమతులకు విరుద్ధంగా 5 అంతస్తులు నిర్మాణాలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణం అని తెలిసి, అధికారులు సీజ్ కూడా చేశారు. అయితే సీజ్ చేసిన నిర్మాణ పనులు ఆపడం లేదు. నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిన టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు దారితీస్తున్నది. పీవీఎన్‌కాలనీలో రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని, గల్లీ రోడ్డులో 5 అంతస్తులు నిర్మాణం చేస్తున్నారు. గతంలో ఫిర్యాదులు వస్తే సామగ్రి జప్తు చేశారు.. సీజ్ చేశారు.. అయినా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. దీనిపై అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తగిన చర్యలు చేపడితే అసలు విషయం వెలుగుచూసే అవకాశం ఉంది.
లోతుకుంట భూ వివాదం సంబంధించి విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విచారణ సందర్భంలో ఎంపిక చేసుకున్న వాటిల్లో మాత్రమే కూల్చివేతలు జరుపుతున్నారని, 40 చెరువుల జోలికి ఎందుకు వెళ్లడం లేదని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే మౌలాలి సర్కిల్ పరిధిలోని బండ చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్న హైడ్రా అటు వైపు వెళ్లకపోవడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా బండ చెరువును అభివృద్ధి చేయాలని, కోర్టు కేసులు పరిష్కరించాలని కొంతకాలంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పోరాటం చేస్తున్నారు.
ఈ క్రమంలో కొంతమంది బండ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతులు లేకుండా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. ఎంఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యల్లో మీనమేషాలు లెక్కిస్తున్నారు..ఇక ప్రతి సర్కిల్ పరిధిలో హైడ్రా అధికారులు ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. నిర్మాణాలు జరుగుతున్న వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. అనుమతులు లేని నిర్మాణాలు చేపట్టి, అమాయక ప్రజలకు విక్రయించి, బిల్డర్లు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో నిర్మాణాలు కూల్చివేస్తే కొనుగోలు చేసిన వారు నష్టపోతున్నారు. అదిలోనే నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు.