ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌కు గాయమైనట్టు ఓ వార్త ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలోని కీలక సన్నివేశ చిత్రీకరణలో భాగంగా ఆయన గుర్రపు స్వారీ చేస్తుండగా, హటాత్తుగా కిందపడిపోయారనీ, దాంతో చేతికి గాయమైందని సోషల్ మీడియాలో వార్త బలంగానే వినిపిస్తున్నది.
చిత్రబృందంలో కొందరు ఈ విషయంపై స్పందించినట్టు, గాయం చిన్నదేనని తెలిపినట్టు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ‘ఫౌజీ’ సినిమా విషయానికొస్తే.. నిరవధికంగా చిత్రీకరణ జరుగుతున్నది.
తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ ఈ ఏడాది దసరాకి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పానిండియా స్థాయిలో భారీ హంగులతో రూపొందుతున్న ఈ ప్రెస్టేజియస్ సినిమాలో ఇమాన్వి కథానాయిక. మిథున్చక్రవర్తి, అనుపమ్‌ఖేర్, జయప్రద, భానుచందర్ కీలక పాత్రధారులు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై రవిశంకర్ యలమంచిలి, నవీన్ యెర్నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.