న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్.. 2030కల్లా రూ.88 లక్షల కోట్లకు చేరవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆడిట్-ట్యాక్స్ అడ్వైజరీ సంస్థ కేపీఎంజీ, రియల్టర్ల సంఘం నరెడ్కో సంయుక్తంగా ఓ తాజా నివేదికను విడుదల చేశాయి. అయితే గత ఏడాది భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువతో పోల్చితే ఈ అంచనాలు మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
‘వికసిత్భారత్@2047లో రియల్ ఎస్టేట్ పాత్ర’ పేరిట రిపోర్టును కేపీఎంజీ, నరెడ్కో రూపొందించాయి. ‘2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యంతో భారత్ ముందుకెళ్తున్నది.
ఈ ఆశయ సాధనకు రియల్టీ రంగం వెన్నెముకలాంటిది. రియల్ ఎస్టేట్ అంటే కేవలం భవనాలే కాదు మరి’ అంటూ ఈ సందర్భంగా సదరు సంస్థలు వ్యాఖ్యానించడం.. దేశ ఆర్థిక వృద్ధిలో రియల్టీ ప్రాముఖ్యతకు అద్దం పడుతున్నది. ‘భారతీయ నిర్మాణ రంగం విలువ 2025లో దాదాపు రూ.26.4 లక్షల కోట్లుగా ఉన్నది. 2030నాటికి ఇది సుమారు రూ.88 లక్షల కోట్లకు చేరవచ్చు’ అని నివేదిక పేర్కొన్నది.
కాగా, 2047 నాటికి దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ రూ.440.5-616.7 లక్షల కోట్లను తాకవచ్చని కేపీఎంజీ ఇండియా ప్రతినిధి నీరజ్ బన్సల్ అన్నారు. ఇక 2030 నాటికి భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగాల సంఖ్య 10 కోట్లకు చేరవచ్చని నరెడ్కో అధ్యక్షుడు ప్రవీణ్ జైన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నిర్మాణ, సేల్స్, డిజైన్, సంబంధిత పరిశ్రమల్లో 7 కోట్ల ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు.