భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ పాల్వంచ, ఫిబ్రవరి 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు తెరలేపింది. 32వ డివిజన్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి గుగులోత్ రాంబాబును కాంగ్రెస్ నాయకులు శుక్రవారం కిడ్నాప్ చేశారు. పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలనే దురుద్దేశంతో కిడ్నాప్‌నకు పాల్పడినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి ఇంటికి వస్తున్న రాంబాబును కాంగ్రెస్ నాయకులు అడ్డుతగిలి ఎత్తుకెళ్లడంతో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాంబాబు భార్య, కుటుంబసభ్యులతో కలిసి అతడి ఇంటివద్ద నిరసన వ్యక్తం చేశారు. కిడ్నాప్‌నకు పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వనమా డిమాండ్ చేశారు. పోలీసులతో బెదిరించి తీసుకువెళ్లడం ఎంతవరకు సమంజసమని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని తిరిగి ఇంటికి పంపించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాంబాబు భార్య మాట్లాడుతూ తన భర్తను కాంగ్రెస్ నాయకులు విడిచిపెట్టాలని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎన్నికల్లో గెలిచే సత్తాలేని కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ అభ్యర్థుల కిడ్నాప్‌నకు పాల్పడడం అనైతికమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఒక ప్రకటనలో ఖండించారు. దమ్ముంటే ఎన్నికల్లో గెలవాలని హితవు పలికారు. ఎంతకాలం ఇలాంటి అరాచకాలు చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల సమయంలో పోలీసులను ఉపయోగించుకుని అక్రమంగా దొడ్డిదారిలో ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. పోలీసులు అనైతికంగా పనిచేస్తే భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు.