ముదిగొండ, నవంబర్ 14: పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ పాత రోజులు రావడం తథ్యమని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్‌రాజు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా కాంగ్రెస్ అంటేనే మోసపూరిత పార్టీ అని విమర్శించారు. చివరికి ఆ పార్టీ 50 ఏళ్లు సేవలందించిన సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్‌ను కూడా మోసం చేసిందని దుయ్యబట్టారు. ‘సంభాని’ని వదులుకోవడంతోనే ఆ పార్టీ పతనం మొదలైందని స్పష్టం చేశారు. అయినా ఇక్కడి నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గెలిచాక హైదరాబాద్‌కు, ఢిల్లీకి చక్కర్లు కొట్టే భట్టి విక్రమార్క మనకొద్దని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లో ఉండే తనను గెలిపిస్తే సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. ముదిగొండ మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన.. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కొండబాల కోటేశ్వరరావు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మండలంలోని వల్లాపురం, అమ్మపేట, వనంవారి క్రిష్ణాపురం, ముత్తారం, పండ్రేగుపల్లి, ఖాణాపురం, న్యూ లక్ష్మీపురం, సువర్ణాపురం, ముదిగొండ, వెంకటాపురం గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో మాట్లాడారు. ఐదేళ్లకోసారి ఎన్నికలప్పుడే వచ్చే అభ్యర్థులను గెలిపిస్తే ప్రయోజనం ఏమీ ఉందని అన్నారు. ఓడిపోయినా ప్రజల వెంటే ఉంటున్న తనను ఆదరించాలని కోరారు. అనంతరం వల్లాపురంలో వివిధ పార్టీల నుంచి పలువురు నాయకులు, ప్రజలు బీఆర్ఎస్లో చేరగా.. వారందరికీ కమల్‌రాజు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. వనంవారి క్రిష్ణాపురం గ్రామస్తులు ఎన్నికల ఖర్చుల కోసం బీఆర్ఎస్ అభ్యర్థి లింగాలకు కొంత ఆర్థిక సాయం అందించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు హరిప్రసాద్, లక్ష్మారెడ్డి, దుర్గ, ప్రసాద్, వెంకటేశ్వరరావు, ఎర్ర వెంకన్న, లక్ష్మి, వెంకట్, ధర్మారావు, వాసు, మల్లయ్య, వెంకటేశ్వర్లు, భిక్షం, వెంకట్రావ్, సతీశ్, అనంతరాములు, కిరణ్, మాధవి, గోవింద్, ఉష, అమరయ్య, శిల్వరాజు, జక్కడర్, బాబు, అప్పిరెడ్డి, నరేందర్, వీరబాబు, కిరణ్, శ్రీను, రమేశ్, పద్మనాభం, పాపారావు, కొట్టె అపర్ణ, ఉపేందర్, సత్యవాణి, స్వాతి, కాజా, రామారావు, శ్రీనివాసరావు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.