ఖమ్మం, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజల లక్ష్యం.. ఆశయం నెరవేరాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో రైతుబిడ్డగా అందరివాడినైన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి మూడోసారి పార్లమెంటుకు పంపాలని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లను కోరారు. శనివారం ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ జిల్లా రైతుబిడ్డగా అందరివాడిగా అందరి ఆప్యాయతల మధ్య వారితో మమేకమై ఉంటూ ప్రజలకు అండదండగా నిత్యం నిలిచిన తనను దండిగా దీవించి, మళ్లీ ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. మూడోసారి కూడా తనను పార్లమెంటుకు కచ్చితంగా పంపిస్తారనే నమ్మకం ఉందని, పార్లమెంట్‌కు వెళ్లి జిల్లా అభివృద్ధికి మరింత కృషిచేస్తానని చెప్పారు. ప్రజా సమస్యలపై జిల్లావాణిని పార్లమెంట్లో బలంగా వినిపిస్తానని అన్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్న తనను కాపాడుకోవాల్సిన బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజలపైనే ఉందన్నారు.
తెలంగాణ ప్రయోజనాలు, జిల్లా ప్రయోజనాలు కాపాడాలంటే తప్పనిసరిగా పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తన తండ్రి నామా ముత్తయ్య పేరు మీద ట్రస్టు పెట్టి పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసునని అన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నానని తెలిపారు. ఒకవైపు నామా ముత్తయ్య ట్రస్టు, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్‌గా, ట్రస్టీగా, మరోవైపు రాజకీయాల్లో పార్టీలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు. ఖమ్మం జిల్లాలో 8వేల కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారులు తీసుకొచ్చిన ఘనత తనకే దకుతుందని చెప్పారు. రెండుసార్లు గెలిపించి పార్లమెంట్‌కు పంపితే కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలపైన, రైల్వే ప్రాజెక్టులు, ఇతర పెండింగ్ ప్రాజెక్టులు, రావాల్సిన నిధుల పైన పోరాటం చేసి సాధించానని చెప్పారు. దేశంలో ఏ ఎంపీ చేయని విధంగా ఖమ్మం జిల్లాలో ఒక లక్షా 55వేల గ్యాస్ కనెక్షన్లు, 60 వేల ఇజ్జత్ రైల్వేపాసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దేశంలో ఏ ఎంపీకి దకని గుర్తింపు ఖమ్మం జిల్లా బిడ్డనైన తనకు దకిందని, పార్లమెంట్‌కు ఎకువశాతం రోజులు హాజరై, అధిక ప్రశ్నలు అడిగి, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అరుదైన గుర్తింపు పొంది జిల్లా ఖ్యాతిని దేశంలో కీర్తింపజేశానని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ప్రజల మనసు గెలుచుకున్న నామా నాగేశ్వరరావును మళ్లీ గెలిపించి పార్లమెంట్‌కు పంపి మరింత అభివృద్ధికి అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. నామాను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు జిల్లా ఓటర్లు సంసిద్ధంగా ఉన్నారని, ఎన్నికల కోసం వేచి చూస్తున్నారని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఎంతో చేశారని, రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక రాజ్యసభ సీటు ఉంటే దాన్ని కూడా ఖమ్మం జిల్లాకు చెందిన బీసీ బిడ్డకు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఖమ్మం, మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ గెలువబోతుందని, తెలంగాణలో 12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ప్రజల లక్ష్యం నెరవేరాలంటే మంచిమనిషి నామాను మళ్లీ పార్లమెంటుకు పంపించాలని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజాలక్ష్యం నెరవేరదని స్పష్టంచేశారు. నామా ప్రశ్నించే గొంతుక అని, ఆయన పార్లమెంట్‌లోనే ఉండాలని, ఈ విషయం ప్రజలు గుర్తించి ఆలోచించి నామాకు పట్టం కట్టాలని కోరారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన నామా పెద్దఎత్తున సేవ చేస్తున్నారని చెప్పారు. ఈ విషయం టీడీపీ శ్రేణులు గుర్తించి కాంగ్రెస్‌కు ఓటు వేయకుండా కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, రఘునాధపాలెం మండల అధ్యక్షుడు వీరూనాయక్, మైనారిటీ నాయకులు తాజుద్దీన్, బిచ్చాల తిరుమలరావు, బొమ్మెర రామ్మూర్తి, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.