మధిర, జులై 04 : ప్రమాదవశాత్తు మున్నేరులో పడి అన్నదమ్ములిద్దరూ మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండవ గ్రామానికి చెందిన కాసిమల్ల చిన్న వెంకటికి ముగ్గురు కుమారులు. వీరిలో బీటెక్ చదువుతున్న పెద్ద కుమారుడు నాగ గోపి ( 23), డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదవబోతున్న చిన్న కుమారుడు నందకిశోర్ (19) గ్రామ సమీపంలో గల మున్నేరులో మిత్రులతో కలిసి బైక్ను శుభ్రం చేసేందుకు దిగారు. వాహనాన్ని శుభ్రం చేసిన అనంతరం నందకిశోర్ కొంచెం లోపలికి కాళ్లు కడుక్కునేందుకు వెళ్లాడు. అక్కడ మున్నేరు లోతుగా ఉండటంతో పాటు వరద ఉధృతంగా వస్తుండడంతో నందకిశోర్ పట్టుతప్పి ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. తమ్ముడిని రక్షించేందుకు అన్న నాగ గోపి ప్రయత్నించి తాను మున్నేటి నీటిలో మునిగిపోయాడు. వారిని రక్షించేందుకు మిత్రుడు కూడా మున్నేరులో పడిపోయాడు.
అక్కడే చేపల వేట కోసం వచ్చిన వారు ఒకరిని రక్షించగా అన్నదమ్ములిద్దరూ మున్నేరు వరద తాకిడికి కొట్టుకుపోయి మునిగిపోయారు. ఈ విషయాన్ని స్థానికులకు సమాచారం అందించారు. చింతకాని తాసీల్దార్ కరుణాకర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు మున్నేరులో మునిగిపోయిన అన్నదమ్ముల మృతదేహాలను కొంత దూరంలో గుర్తించారు. వారి మృదేహాలను ప్రోక్లైన్ యంత్రంతో మున్నేరు నుంచి వెలికితీసి ఒడ్డుకు చేర్చారు. కొడుకులిద్దరి మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. చింతకాని ఏఎస్ఐ లక్ష్మణ్ చౌదరి కేసు నమోదు చేశారు.
Madhira : మున్నేరులో పడి అన్నదమ్ములు మృతి