“ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను దెబ్బతీస్తే చాలు.. దానంతట అదే సర్వనాశనం అవుతుంది.” ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ విద్యావ్యవస్థ ఘోరమైన పరిస్థితిలో ఉంది. పలు పాఠశాలల్లో సమస్యలు తిష్ఠ వేసుకొని కూర్చున్నాయి. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరు.. పారిశుధ్యం పడకేసింది.. స్కావెంజర్లు లేకపోవడంతో మరుగుదొడ్లు దుర్గంధం వెదజల్లుతున్నాయి. విద్యార్థులకు పూర్తిస్థాయిలో పుస్తకాలు లేవు.. రెండు జతల యూనిఫాం లేదు.. ఇక మధ్యాహ్న భోజన నిర్వాహకుల దుస్థితి మరీ దయనీయం. జీతాలు లేక కుటుంబం గడవడమే కష్టంగా మారింది. ఇదంతా కాంగ్రెస్ ‘ప్రజాపాలన’ పుణ్యమేనంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలతో సహవాసం చేస్తున్నారు. మధ్యాహ్న భోజన సిబ్బంది వెతలు వర్ణనాతీతం. ఏజెన్సీలకు నిర్వహణ ఖర్చులు, గుడ్ల బిల్లులు రాక బోరుమంటున్నారు. కుటుంబపోషణ గడవక సతమతమవుతున్నారు. ఇక ఏ పాఠశాల పరిస్థితి చూసినా ఏముంది గర్వకారణం అన్నట్లుగా పిచ్చిచెట్లు, చెత్తాచెదారంతో నిండిపోయాయి. అక్కడక్కడా ఉపాధ్యాయులు సొంత డబ్బులతో స్కావెంజర్స్‌ను నియమించుకుంటున్నా మిగిలిన పాఠశాలల్లో టాయిలెట్స్ డోర్సు తెరిచే అవకాశమే లేదు. కొన్ని పాఠశాలల్లో కొన్ని సబ్జెక్ట్‌లకు చాక్‌పీస్ పట్టుకునేవారే లేరు, ఉపాధ్యాయ ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. వీటన్నింటిని పరిష్కరించి పాఠశాలలకు మళ్లీ మునుపటి దశ తీసుకురావాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శనిలా ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కుక్ కం హెల్పర్స్ పరిస్ధితి. నెలల తరబడి గౌరవ వేతనాలు చెల్లించకపోవడంతో వారి బాధలు చెప్పశక్యం కానివిగా ఉన్నాయి. నెలనెలా మొదటి తేదీనే జీతాలు తీసుకుంటున్న అధికారులు, ప్రభుత్వానికి కుక్ కం హెల్పర్స్ బాధలు చెవికెక్కడం లేదు. చాలీచాలని గౌరవ వేతనంతో బతుకులు వెళ్లదీస్తున్నా ఆ కొద్దిమొత్తాలు కూడా నెలనెలా అందక వారి కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో మొత్తం 2,434 మంది కుక్ కం హెల్పర్స్ పని చేస్తున్నారు. వీరికి గౌరవ వేతనంగా నెలకు ఒక్కొక్కరికి రూ.3 వేలు చెల్లిస్తున్నారు. దీనిలో రూ.వెయ్యి కేంద్ర ప్రభుత్వం, మిగతా రూ.2 వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం 2023-24కి సంబంధించి ఇటీవల కొంత నిధులను విడుదల చేసింది. మధ్యాహ్న భోజన సిబ్బంది గౌరవ వేతనం సకాలంలో రాక సమస్యలు పడుతున్నారు. 2024 సంవత్సరం ఫిబ్రవరి, మార్చి వరకు వేతనాలను చెల్లించారు. ఇంకా మార్చి, ఏప్రిల్, జూన్‌కు సంబంధించిన వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.
విద్యార్థులకు బలవర్ధకమైన, పౌష్టికహార భోజనాన్ని అందించాలని ప్రభుత్వం వారానికి రెండు మధ్యాహ్న భోజనంలో గుడ్లు అందిస్తోంది. మధ్యాహ్న భోజనంతోపాటు గుడ్డు అందించే వారికి మాత్రం బిల్లులు రాక బలహీన పడిపోయేలా చేస్తున్నాయి. మేము బిల్లులు రాకపోతే మధ్యాహ్న భోజనం సైతం అందించలేమనే పరిస్థితి కొన్నిచోట్ల అధికారులకు ఎదురవుతుంది. జిల్లాలో గత సంవత్సరంలో 87,574 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లబ్ధి చేకూరగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల తాలూకా గుడ్డుకు సంబంధించిన బిల్లులు ఫిబ్రవరి వరకు అందాయి. 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన బిల్లులు మాత్రం 2023 డిసెంబర్ వరకే అందించారు. మధ్యాహ్న భోజనం బిల్లులు సైతం 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మార్చి వరకు రాగా, 9, 10వ తరగతి విద్యార్థులకు 2024 జనవరి నెల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి.
పాఠశాలల్లో స్కావెంజర్స్ లేక పాఠశాలలు అస్తవ్యస్థంగా ఉన్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షలో హెచ్ఎంలతా సమష్టిగా స్కావెంజర్స్ కావాలని విన్నవించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆవరణను శుభ్రం చేసేవారు లేక, టాయిలెట్స్ ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని పాఠశాలల్లో అయితే ఉపాధ్యాయులు తలా కొంత వేసుకుని సిబ్బందిని నియమించుకున్న సంఘటనలు ఉన్నాయి. మరికొన్ని పాఠశాలల్లో దాతల సహకారంతో స్కావెంజర్స్‌ను నియమించుకున్నారు. జిల్లాలో అమ్మ ఆదర్శ కమిటీలు నామమాత్రమే అయ్యాయి. చాలా స్కూల్స్‌లో మరమ్మతు పనులు పెండింగ్‌లో ఉన్నాయంటే వాటి పరిస్థితిని అంచనా వేయవచ్చు.
చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక బోధన దినదినగండంగా మారింది. వేంసూరు, ఎర్రుపాలెం వంటి మండలాల్లో చాలా సబ్జెక్ట్‌ల్లో ఉపాధ్యాయులే లేరు. ఎస్జీటీలు, పండిట్లు అప్‌గ్రేడ్ అయిన తర్వాత జిల్లాలో ఎస్జీటీల ఖాళీలు 776 ఉన్నాయి. వీరితోపాటు ఈ రెండునెలల కాలంలో ఉద్యోగ విరమణ పొందనున్న వారు సుమారు వంద మందికిపైగానే ఉన్నారు. వీరందరితో కలిపి సుమారు వెయ్యి మందికిపైగా జిల్లాలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఉపాధ్యాయుల సర్దుబాటు చేద్దామన్నా పూర్థిస్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయలేని పరిస్థితి ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలి. బ్రేక్‌ఫాస్ట్ లేక ఎంతోమంది పేద విద్యార్థులు అలమటిస్తున్నారు. ప్రజాపాలన అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి బ్రేక్‌ఫాస్ట్ విధానాన్ని కొనసాగిస్తే బాగుంటుంది. విద్యార్థులకు రెండు జతల యూనిఫాం కచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒక జత ఇచ్చి చేతులు దులుపుకుంటే ఊరుకునేదిలేదు. ఒక జత యూనిఫాంతో రోజూ స్కూల్‌కు ఎలా వేసుకెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితి విద్యార్థుల్లో నెలకొంది.-
పేద విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ను ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగించాలి. సర్కార్ స్కూల్స్‌లో చదువుకునే విద్యార్థులు ఆకలితో అలమటించొద్దనే గొప్ప ఆలోచనతో గత సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంతో పేదల పిల్లల కడుపు నిండుతుంది.
గత సంవత్సరం వరకు వేతనాలు అందాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సక్రమంగా అందడం లేదు. అంగన్వాడీ ఆయాలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అల్పాహారం పథకం కూడా కొనసాగడం లేదు. కోడిగుడ్డు, పాలు సక్రమంగా అమలుకావడం లేదు. టీఏ, డీఏలు రావడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం టీచర్లకు లక్ష, ఆయాలకు రూ.50 వేలు ఇచ్చి రిటైర్మెంట్ చేయాలని చూడడం అన్యాయం. జీవో నెంబర్ 10ని అమలు చేస్తూ త్వరగా పదవీ విరమణ వయసును నిర్ధారించడంపై సమ్మెలు చేస్తున్నాం. మా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి పరిష్కరించాలి.
నేను తిమ్మంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో కుక్‌గా గత ఐదేండ్లుగా పనిచేస్తున్నాను. గత ప్రభుత్వంలో జీతాలు, బిల్లులు సమయానికి వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏడు నెలలుగా బిల్లులు సరిగ్గా అందడం లేదు. కోడిగుడ్డు బిల్లులు ఫిబ్రవరి నుంచి రాలేదు. వీటిని వెంటనే చెల్లించాలి. మధ్యాహ్నభోజనం నడపడం ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. మా జీతాలు మూడు నెలలకి పెంచుతామని ప్రభుత్వం చెప్పింది, కానీ ఇంతవరకు పెంచలేదు.