Bonalu Festival | రామవరం, జూలై 20: ఆషాడ మాసం ఆఖరి ఆదివారం పురస్కరించుకొని సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతాలలో పండుగ వాతావరణం కనిపించింది. ఎక్కడ చూసినా గ్రామ దేవత అయిన వేల్పులమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో నిర్వహించే ఈ బోనాలలో ప్రజల సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో నీ బిడ్డలం బోనమెత్తినము మమ్ము సల్లంగా చూడు తల్లి అంటూ మొక్కలు చెల్లించుకున్నారు.
ఆషాడ మాసం అంటేనే వర్షాకాలం.. అంటువ్యాధులకు ఆలవాలమైన మాసం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు, పొంగు, అమ్మవారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లంగా చూసేందుకే అనాదిగా బోనాలు సమర్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎంతో నియమనిష్ఠలతో అమ్మవారికి పరమాన్నం వండి, బెల్లం శాకం తో బోనాన్ని తయారుచేసి ఇంటి నుండి డప్పు వాయిద్యాలతో అమ్మవారి ఆలయానికి చేరి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత అమ్మవారికి సమర్పించగా మిగిలిన పదార్థాలను ప్రసాదాలుగా స్వీకరించి అందరికీ పంపిణీ చేశారు.