Koneru Chinni | భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : బీజేపీ భద్రాద్రి జిల్లా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పిన కోనేరు చిన్ని (మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు కుమారుడు).. మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. హైదారాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఈయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్ఎస్ భద్రాద్రి, ఖమ్మం జిల్లాల అధ్యక్షులు రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. కాగా, కోనేరు చిన్ని బీఆర్ఎస్లో చేరడంతో భద్రాద్రి జిల్లాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగూడెం నియోజకవర్గంతోపాటు భద్రాద్రి జిల్లాలో బలమైన సామాజికవర్గం, క్యాడర్ కలిగిన కోనేరు చిన్ని బీఆర్ఎస్లోకి రావడంతో బీఆర్ఎస్ బలం మరింత పెరిగింది. మంగళవారం కొత్తగూడెం జిల్లా కేంద్రం నుంచి 300 కార్లతో సుమారు 3 వేల మంది కార్యకర్తలు, కోనేరు అభిమానులు హైదరాబాద్ వెళ్లారు. పార్టీలో చేరిన వారందరికీ మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పారు.
మళ్లీ మనదే అధికారం: మంత్రి కేటీఆర్
భవిష్యత్ మనదేనని, మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కోనేరు చిన్నిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అద్భుత పాలన జరుగుతోందని అన్నారు. అయితే బీజేపీ మాత్రం మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని విమర్శించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలంతా సమైక్యతా దినోత్సవం పాటిస్తే.. బీజేపీ నేతలు మాత్రం ప్రజలను రెచ్చగొట్టేలా విమోచన దినం చేస్తున్నారని అన్నారు. మళ్లీ పాతరోజులను గుర్తుకు తెచ్చి ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. వారికి తోడుగా కాంగ్రెస్ నేతలు కూడా వంతపాడుతున్నారని దుయ్యబట్టారు. లేనిపోని వాగ్దానాలు చేసి పబ్బం కడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. అయినా వారి హామీలను ప్రజలెవరూ నమ్మరని అన్నారు. ప్రజలకు అండగా ఉండేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
దేశమంతా తెలంగాణ వైపే చూస్తోంది: కోనేరు చిన్ని
అద్భుత పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశమంతా తెలంగాణ వేపే చూస్తోందని కోనేరు చిన్ని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్సే మళ్లీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లాలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు నచ్చే బీఆర్ఎస్లో చేరుతున్నానన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధులు తనను చాలా రోజుల క్రితమే పార్టీలోకి ఆహ్వానించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.