– కారేపల్లిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
కారేపల్లి, అక్టోబర్ 17 : బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం సీపీఐ(ఎం) సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్రం తీరును నిరసించారు. తలారి దేవ ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే అడ్డుకుంటుందన్నారు. జనగణన పూర్తి చేసి బీసీ కులాల జనాభా సంఖ్యకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం ప్రవేశ పెట్టిందని అందుకు బీఆర్ఎస్, బీజేపీ అన్ని పక్షాలు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించగా గవర్నర్ పెండింగ్లో పెట్టడం, అటు కేంద్ర ప్రభుత్వం బిల్లును పాస్ చేయకుండా ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసి అందుకు తమ కారణం కాదన్నట్లు నటిస్తుందని దుయ్యబట్టారు. బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణం 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు వజ్జా రామారావు. కొండబోయిన ఉమావతి, శాఖ కార్యదర్శి అన్నవరపు కృష్ణ, నాయకులు ముక్కా సీతారాములు, కర్కపల్లి రాయమల్లు, అరెల్లి శ్రీరాములు, వెంకన్న, రవి పాల్గొన్నారు.