బోనకల్లు, నవంబర్ 10: దేశంలో బీజేపీ ప్రభుత్వం అగ్గి రగిలిస్తూ రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. దేశ ప్రజల మధ్య కులమతాల చిచ్చు పెడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసేందుకు కుట్ర పన్నుతోందని, దొడ్డిదారిన ప్రభుత్వ ఏర్పాటుకు కుటిల యత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. దేశంలో అప్రజస్వామిక పద్ధతిని అవలంబిస్తున్న బీజేపీ విధానాలను ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. మండలంలోని కలకోట, నారాయణపురం గ్రామాల మధ్య రూ.54.50 లక్షలతో పీఎంజీఎస్‌వై నిధులతో ఏర్పాటు చేసిన బీటీ రోడ్డుకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.
మోటమర్రి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి పూలమాలలు వేశారు. అదే గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీల్లో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం కలకోట పెద్దచెరువును సైతం పరిశీలించారు. ఈ చెరువు కట్టపై సీసీ రోడ్డు నిర్మాణానికి అదనపు నిధులు కావాలని పంచాయతీరాజ్ అధికారులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఫోన్ చేసి చెరువు కట్ట అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలని కోరారు. అందుకు మంత్రి కూడా స్పందించి.. వెంటనే రూ.కోటి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా గెలువకుండా రాష్ట్ర ప్రభుత్వాలను అడ్డదారిలో పడగొట్టి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే కుటిల రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని విమర్శించారు.
తెలంగాణను, తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా ప్రధాని మోదీ, ఆయన అనుచరులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందున్నదని గుర్తుచేశారు. అనంతరం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు నల్లమల వెంకటేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, కంకనాల సౌభాగ్యం, మోదుగుల సుధీర్‌బాబు, వెంగళ దయామణి, కేతినేని ఇందు, వెంగళ మార్తమ్మ, కేవీకే శ్రీనివాస్, రావూరి రాధిక, వేణుమాధవ్, చేబ్రోలు మల్లికార్జునరావు, బంధం శ్రీనివాసరావు, తన్నీరు రవికుమార్, బాణోతు కొండ, తాళ్లూరి హరీశ్, ఇటికాల శ్రీనివాసరావు, చావా హనుమంతరావు, వేమూరి ప్రసాద్, పైడిపల్లి కిశోర్, మోదుగుల నాగేశ్వరరావు, చిట్టిమోదు శ్రీనివాసరావు, పెద్దప్రోలు నాగేశ్వరరావు, జంగా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.