భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలో బీజేపీకి ఎదురు దెబ్బతగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తెలంగాణ పథకాలు నచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్ వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చించారు. త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. కాగా, కోనేరు చిన్ని తండ్రి కోనేరు నాగేశ్వరరావు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలోనే అప్పటి నేత కేసీఆర్‌కు, కోనేరు నాగేశ్వరరావుకు మంచి సాన్నిహిత్యం ఉండేది. అయితే కోనేరు నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలోనే కోనేరు చిన్ని టీడీపీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేశారు. ఆ తరువాత జిల్లా బాధ్యతలూ చేపట్టారు. కోనేరు నాగేశ్వరరావు మరణం తర్వాత కూడా ఆయన టీడీపీలోనే ఉన్నారు. అయితే ఇటీవల బీజేపీలో చేరిన ఆయన.. ఆ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఇటీవల తెలంగాణ పథకాలు అద్భుతంగా కొనసాగుతుండడం, ఈ పథకాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభించడం వంటి కారణాలతో బీఆర్ఎస్లో చేరేందుకు కోనేరు చిన్ని నిర్ణయించుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం
విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని పేర్కొన్నారు. కొత్తగూడెంలోని తన ఇంటి వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్దే విజయమని స్పష్టం చేశారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్ల వంటి పథకాలు అద్భుతమని అన్నారు.
సీఎం కేసీఆర్‌ను కలిశా..
తన తండ్రి కోనేరు సత్యనారాయణ, అప్పటి నేత కేసీఆర్ ఎప్పటినుంచో స్నేహితులని కోనేరు చిన్ని అన్నారు. ఆ పరిచయాల వల్ల ఇటీవల హైదరాబాద్ ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశానని, త్వరలోనే బీఆర్ఎస్లో చేరుతానని చెప్పారు. తనతోపాటు యువమోర్చా, కిసాన్ మోర్చా బాధ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరమూ కలిసి బీఆర్ఎస్లో చేరుతామన్నారు. దీంతో కొత్తగూడెంలో బీజేపీ ఖాళీ అవుతుందని స్పష్టం చేశారు. బీజేపీ అనుబంధ సంఘాల బాధ్యులు కే.నాగేశ్వరరావు, జోగు ప్రదీప్‌కుమార్, జోగు రమాదేవి, హరిహరన్ యాదవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.