భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 4 (నమస్తే తెలంగాణ): వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు.. భూగర్భ జలాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం జలశక్తి కార్యక్రమం ద్వారా ‘జల్ సంచాయి జన్ భాగిదారి’ విభాగంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి రూపకల్పన చేసింది. దీంతో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ స్వయంగా పలుగు పార పట్టి ఇంకుడు గుంతలు తవ్వడంతోపాటు అధికారులను, సిబ్బందిని నిర్మాణంలో భాగస్వాములను చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లోని అన్ని విభాగాలు, ఖాళీ ప్రదేశాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల ఒనగూరే లాభాల గురించి విస్తృతంగా అవగాహన కల్పించారు. జిల్లావ్యాప్తంగా 29,103 సోక్ పిట్స్ పూర్తి చేయగా.. మరో 2,581 పిట్స్ నిర్మాణ దశలో ఉండటం ఆయన పనితీరుకు నిదర్శనంగా నిలిచింది. ఈ కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ జితేశ్ పనితీరును ప్రశంసించారు. దీనిపై బుధవారం ఒక ప్రకటన విడుదల చేసిన కలెక్టర్.. అన్ని శాఖల అధికారులు, ఈజీఎస్, డీఆర్డీఏ ఉద్యోగులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
లక్ష్మీదేవిపల్లి, జూన్ 4: భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చిందని, తమ సమస్యలపై రెవెన్యూ సదస్సులో దరఖాస్తు అందజేసిన వెంటనే అధికారులు భూ సమస్యను పరిష్కరిస్తారని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. బంగారుచెలక గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై రైతులు ఇచ్చిన దరఖాస్తులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో భూ రికార్డులలో పేర్లు తప్పులు, భూమి విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు తదితర అంశాలపై దరఖాస్తులు సమర్పిస్తే అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడతారని తెలిపారు. నిర్దేశిత గడువులోగా భూ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు.