ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు నిరసనలను రెండోరోజు ఆదివారమూ కొనసాగించారు.. పట్టణాలు, మండల కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు.. బండి సంజయ్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో దిష్టిబొమ్మను దహనం చేశారు.. మరోసారి నోరు జారితే ప్రజలే శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని హెచ్చరించారు..
– నమస్తే నెట్వర్క్
నమస్తే నెట్వర్క్: ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అహంకార పూరితమైనవని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవితపైగానీ, మహిళలపైగానీ మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ప్రపంచమంతా మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో తెలుగింటి ఆడబిడ్డపై, గౌరవప్రదమైన హోదాలో ఉన్న మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అతడి అహంకారాన్ని రుజువు చేస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రేణులు ఆదివారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఎక్కడికక్కడ బండి దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించారు. అనంతరం వాటిని దహనం చేశారు. అవే దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతూ, వాటిపై రాళ్లు విసురుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల పట్ల బండి సంజయ్‌కి ఏమాత్రం గౌరవమున్నా వెంటనే కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైరాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెలే రాములునాయక్, మిగతా మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.