కొత్తగూడెం క్రైం, నవంబర్ 26 : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు హెచ్చరించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గల కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఆయన నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ పద్ధతిలో నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.
కేసుల విచారణలో జాప్యం చేయొద్దన్నారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిత్యం రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గంజాయి, పీడీఎస్ బియ్యం వంటి అక్రమ రవాణా, మట్కా, బెట్టింగ్ వంటి జూదాలను నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం జరిగే చేయాలన్నారు. అనంతరం గత నెలలో వర్టికల్స్ వారీగా విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు షేక్ అబ్దుల్ రెహమాన్, ఆర్.సతీశ్‌కుమార్, చంద్రభాను, వి.రవీందర్‌రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, అన్ని సబ్ డివిజన్లు, వివిధ విభాగాల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.