చర్ల, ఏప్రిల్ 17: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు మోటారు సైకిల్‌పై తిరుగుతూ గురువారం పరిశీలించారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దు దండకారణ్యంలో పర్యటించిన ఆయన చర్ల మండలం పూసుగుప్ప నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు రాంపురం గ్రామాల మధ్య రూ.2.9 కోట్ల వ్యయంతో చేపట్టిన 1.9 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు.
సరిహద్దు గ్రామాల్లో నిర్మిస్తున్న రోడ్డు వల్ల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాంపురం, భీమవరంపాడు గ్రామాల ఆదివాసీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎస్పీ అన్నారు. ఆదివాసీ గిరిజనులకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు పోలీసు శాఖ ద్వారా చేపట్టిన పనులను ఆయన మీడియాకు వివరించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ విక్రమ్‌కుమార్ సింగ్, సీఐ రాజువర్మ ఉన్నారు.