కొత్తగూడెం ప్రగతి మైదాన్, మే 12: శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు స్పష్టం చేశారు. ప్రతీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో కొత్తగూడెంలోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి వంటి మత్తు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, క్రయవిక్రయాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, వాటి నిర్మూలనకై జాప్యం చేయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా హాట్స్పాట్లను గుర్తించి గంజాయి రవాణా చేసే వ్యక్తులతోపాటు వినియోగించేవారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతీ కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్ష పడిలా, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు కూడా తప్పవని స్పష్టం చేశారు.
పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. దొంగతనం కేసుల్లో ప్రస్తుతం పోలీస్ శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను వినియోగించి నేరస్తులను పట్టుకుని ప్రాపర్టీని రికవరీ చేసి బాధితులకు త్వరితగతిన అందేలా కృషి చేయాలన్నారు. రాబోయే వర్షాకాలం అధిక వర్షాలు సంభవించినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల భారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల్లో నగదును కోల్పోయి, బాధితులు వెంటనే ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించి వారికి అండగా ఉండాలన్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను ‘బ్లాక్ స్పాట్స్’గా గుర్తించి.. సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యేవారిని గుర్తించి నిరంతరం వాహన తనిఖీలు చేపట్టాలని, పట్టుబడినవారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, డీసీఆర్బీ డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, ఆర్.సతీశ్‌కుమార్, చంద్రభాను, వీ.రవీందర్‌రెడ్డి, మల్లయ్యస్వామి సహా ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.