భద్రాచలం, ఆగస్టు 17: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా పవిత్రోత్సవాలకు వైభవంగా అంకురార్పణ గావించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు గోదావరి నదీ మధ్యభాగం నుంచి వెండి తీర్థపు బిందెలో పవిత్ర జలాలను తీసుకొని వచ్చి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. శుక్ర, శనివారాల్లో నిత్య హోమాలు, వేద పారాయణం జరుపుతారు. ఆదివారం పూర్ణాహుతి, పవిత్రాల ఉద్వాసన, మహాకుంభ ప్రోక్షణ చేస్తారు. పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్న కారణంగా, స్వామివారు దీక్షలో ఉన్నందున బుధవారం నుంచి ఆదివారం వరకు ఆలయంలో నిత్యకల్యాణాలను, ఏకాంత సేవలను నిలిపివేస్తారు.