భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం ముగియడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో సీట్లు దక్కని అభ్యర్థులు రెబల్స్‌గా బరిలో నిలిచారు. సీపీఐ, సీపీఎం నుంచి కూడా సుజాతనగర్ డివిజన్లల్లో రెండు స్థానాల్లో రెబల్స్ వేసినట్లు తెలిసింది. మొత్తంగా కొత్తగూడెంలో నామినేషన్ల ఉపసంహరణ నాటికి 592 నామినేషన్లు ఉండగా మంగళవారం 234మంది ఉపసంహరణ చేసుకున్నారు. దీంతో మొత్తంగా బరిలో 354 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ అభ్యర్థులు అన్ని డివిజన్లలో బరిలో నిలిచారు.
వీరితోపాటు స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ బరిలో కాంగ్రెస్ నుంచి 53వ వార్డులో సీటు ఆశించిన పల్లపు వెంకటేశ్వర్లుకు బీఫారం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నాయకుడి ఇంటి ముందుకెళ్లి మరీ నిరసన తెలిపారు. 29, 30వ వార్డుల్లో కూడా అసలైన కాంగ్రెస్ నాయకులకు టికెట్లు కేటాయించకపోవడంతో రెబల్స్‌గా బరిలో ఉన్నారు. రామవరం ప్రాంతంలో కాంగ్రెస్ నుంచి మోరె రూప కార్పొరేషన్ కార్యాలయం వద్దనే నాయకుల్ని దుమ్మెత్తిపోసింది. సుజాతనగర్ డివిజన్లో కూడా కాంగ్రెస్, సీపీఐకు రెబెల్స్ బెడద తప్పలేదు. పాల్వంచలోని ఐదు డివిజన్ల్లో ఒకో డివిజన్ నుంచి ముగ్గురు చొప్పున రెబెల్స్‌గా బరిలో నిలిచారు. ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల పరిధిలో కూడా రెబల్స్ బెడద తప్పలేదు. పోలింగ్ వరకు బుజ్జగిస్తారా లేక బరిలో ఉండి పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణం అవుతారో వేచిచూడాల్సిందే.