భద్రాద్రి కొత్తగూడెం, జూలై 21 (నమస్తే తెలంగాణ):‘జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడి వర్షాలతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద తోడు కావడంతో గోదావరి ఉధృతి పెరిగింది. గురువారం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశాం. దీనిని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పని చేస్తోంది. వర్షాలతో సీజనల్ వ్యాధులు సక్రమించే అవకాశం ఉన్నందున జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ బృందాలు పక్కా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నాయి. జిల్లాలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం ఉండడం వల్ల అక్కడక్కడా చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. వర్షాకాలంలో పారిశుధ్య నిర్వహణ, విద్యుత్‌కు అంతరాయం కలగకుండా సంబంధిత శాఖలను ఆదేశించాం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాం’ అని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. పేర్కొన్నారు. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆమె శుక్రవారం భద్రాచలంలోని వరద పునరావాస కేంద్రంలో ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘వర్షాకాలం సీజన్ కావడంతో ఆలస్యంగానైనా జిల్లా అంతటా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భద్రాచలం గోదావరికి వరదలు రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నా వాటిని సమర్థంగా ఎదుర్కొంటున్నాం. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం సమర్థంగా పని చేస్తోంది’ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నాం. వైద్యారోగ్య, విద్యుత్ రంగాలు ప్రస్తుత వానకాలంలో ప్రణాళికతో పనిచేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. శుక్రవారం భద్రాచలంలోని వరద పునరావాస కేంద్రంలో ఆమె ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే: వ్యాధులు, వర్షాల సీజన్లో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్: ఏటా వర్షాకాలం సీజన్లో వ్యాధులు ప్రబలడం సహజమే. వర్షాలు ఎక్కువగా ఉంటే వరదలు కూడా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తరఫున పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరవు. వైద్యపరంగా ప్రతి పీహెచ్సీ, ఏరియా వైద్యశాలల్లో మందులను అందుబాటులో ఉంచాం. అత్యవసర పరిస్థితుల్లో వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. వరదలను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండి సౌకర్యాలు కల్పిస్తోంది.
నమస్తే: వానకాలం పంటల సీజన్. రైతులకు ఎలాంటి జాగ్రత్తలు చెబుతున్నారు?
కలెక్టర్: వానకాలం సీజన్లో రైతులు పండించే పంటలకు సరిపడా వర్షం కురిసింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేశాం. అన్ని పంటలకు సరిపడా ఎరువుల నిల్వలు, విత్తనాలు అందుబాటులో ఉంచాం. డీలర్ల వద్ద ఎరువులు, విత్తనాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయ శాఖ కూడా తగిన తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.
నమస్తే: వరదల సమయంలో విద్యుత్‌కు అంతరాయం తరచూ ఉంటుంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్: ప్రస్తుతం గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించి తగ్గుముఖం పట్టింది. ఇప్పటివరకు ఏ గ్రామంలో విద్యుత్‌కు అంతరాయం కలగలేదు. ఒకవేళ వచ్చినా దానిపై చర్యలు తీసుకుని నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు విద్యుత్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడో ప్రమాద హెచ్చరిక దాటినా విద్యుత్‌కు ఎలాంటి అంతరాయం ఉండదు. మంచినీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుంది.
నమస్తే: వర్షాల వల్ల రవాణా సౌకర్యానికి ఎక్కడైనా ఆటంకం కలిగిందా?
కలెక్టర్: గత వరదల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరించాం. ప్రస్తుతం చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాల పరిధిలో రహదారులపైకి ఎక్కడా వరదనీరు రాలేదు. భారీ వర్షాల వల్ల రహదారులకు అక్కడక్కడా గుంతలు పడ్డాయి. ఆర్అండ్బీ అధికారులకు చెప్పి వాటిని పూడ్పిస్తున్నాం.
నమస్తే: వరదల్లో తాగునీటి సరఫరా ఎలా జరుగుతుంది?
కలెక్టర్: గోదావరి వరదలు వచ్చినప్పుడు వాటర్ ట్యాంకుల ద్వారా వచ్చే నీరు కొంతమంది తాగరు. కానీ.. వాటిని వాటర్ టెస్ట్‌లు చేయించి మరీ సరఫరా చేయిస్తున్నాం. కాచి చల్లార్చిన నీరు తాగడం వల్ల వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాం. ప్రస్తుతానికి ఒక కేంద్రాన్ని మాత్రమే ప్రారంభించాం. అందులో ఒక వార్డుకు సంబంధించిన బాధితులు మాత్రమే ఉన్నారు. మొత్తం మీద 71 కేంద్రాలు వరద బాధితుల కోసం అందుబాటులో ఉంచాం.
నమస్తే: పారిశుధ్య నిర్వహణపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
కలెక్టర్: పారిశుధ్యం అంటేనే వర్షాకాలంలో సమస్య ఉంటుంది. కానీ.. ప్రస్తుత సీజన్లో పారిశుధ్య కార్మికులు సమ్మెలో ఉన్నా వేరే ప్రాంతాల నుంచి కార్మికులను తెప్పించి ఎక్కడా అపరిశుభ్రం లేకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాం. భద్రాచలం రామాలయ ఆవరణలో వర్షపు నీరు చేరడం వల్ల కొంచెం అపరిశుభ్రత కనిపించింది. వాటిని వెంటనే కార్మికులు శుభ్రం చేశారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించాం. దోమలు రాకుండా ఫాగింగ్, స్ప్రేయింగ్, దోమల మందు పిచికారీ కూడా చేయిస్తున్నాం.