పాల్వంచ రూరల్, సెప్టెంబర్ 30 : ప్రతి విద్యార్థి కంప్యూటర్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని, ఇందుకోసం ఉపాధ్యాయులు వారికి చిన్నతనం నుంచే మెళకువలు నేర్పించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జగన్నాథపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం టీఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా అందించిన కంప్యూటర్ తరగతి గదిని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు అందించిన కంప్యూటర్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు.
కంప్యూటర్ వినియోగంలో ఏమైనా సందేహాలుంటే నిష్ణాతులైన ఉపాధ్యాయులు నివృత్తి చేయాలన్నారు. విద్యాభివృద్ధికి తాండ్ర నారాయణరావు ట్రస్ట్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కూనంనేని కొనియాడారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఔషధ మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వరాచారి, తహసీల్దార్ వివేక్, ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఎంఈవో శ్రీరామ్మూర్తి, టీఎన్ఆర్ ట్రస్టు సభ్యులు నవీన్, నరాటి ప్రసాద్, సీపీఐ నాయకులు సాబీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.