భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మామిళ్లగూడెం, డిసెంబర్ 2: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. బుధవారం నుంచి మూడో విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మూడో విడతలో భద్రాద్రి జిల్లాలోని ఏడు మండలాల్లో ఉన్న 155 పంచాయతీలకు, 1,330 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఖమ్మం జిల్లాలోనూ 191 పంచాయతీలకు, 1,742 వార్డులకు నామపత్రాలు స్వీకరించనున్నారు.
ఈ విడతలో నామినేషన్ల స్వీకరణ కోసం ఎన్నికల సిబ్బంది ఆయా మండలాల్లోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం నుంచి మొదలయ్యే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మూడు రోజులపాటు జరుగనుంది. ఈ మూడు రోజుల్లో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తరువాత రోజు నుంచి నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటైన నామినేషన్ల ప్రకటన, ఆ మరుసటి రోజు అభ్యంతరాల స్వీకరణ, ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణ వంటి ప్రక్రియలు ఉంటాయి. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 9న అధికారులు ప్రకటిస్తారు.
భద్రాద్రి జిల్లాలో..
భద్రాద్రి జిల్లాలోని ఏడు మండలాల్లో నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో 31 పంచాయతీలు, 260 వార్డుల నుంచి నామినేషన్ల స్వీకరణ కోసం 9 నామినేషన్ల కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆళ్లపల్లిలో 12 జీపీలు, 90 వార్డుల కోసం రెండు; గుండాలలో 11 జీపీలు, 96 వార్డుల కోసం మూడు; జూలూరుపాడులో 23 జీపీలు, 188 వార్డుల కోసం ఆరు; సుజాతనగర్లో 13 జీపీలు, 110 వార్డుల కోసం నాలుగు; టేకులపల్లిలో 36 జీపీలు, 312 వార్డుల కోసం ఏడు; ఇల్లెందులో 29 జీపీలు, 254 వార్డుల కోసం ఎనిమిది చొప్పున నామినేషన్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లో ఉన్న 191 పంచాయితీలకు, 1,742 వార్డులకు బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. సింగరేణి (కారేపల్లి) మండలంలోని 41 పంచాయతీలు, 356 వార్డులకు; తల్లాడలోని 27 పంచాయతీలు, 252 వార్డులకు; సత్తుపల్లిలోని 21 పంచాయతీలు, 208 వార్డులకు; కల్లూరులోని 23 పంచాయతీలు, 214 వార్డులకు; పెనుబల్లిలోని 32 పంచాయతీలు, 290 వార్డులకు; వేంసూరులోని 26 పంచాయతీలు, 244 వార్డులకు; ఏన్కూరులోని 21 పంచాయతీలు, 178 వార్డులకు ఈ మూడో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.