భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): యాస్పిరేషనల్ (ఆకాంక్షిత) బ్లాక్లో మంజూరైన అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. పెండింగ్ పనులను కూడా సత్వరమే చేపట్టేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యాస్పిరేషనల్ పనుల తీరుపై విద్య, వైద్య, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్, పశు సంవర్ధక శాఖ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, ఇరిగేషన్ శాఖల అధికారులతో ఐడీవోసీలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మిషన్ భగీరథ మంచినీరు సరఫరా కాని గ్రామాల్లో బోర్వెల్స్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు. సోలార్ విద్యుత్ ద్వారా మంచినీరు సరఫరా చేసేందుకు కూడా చర్యలు చేపట్టాలన్నారు.
అలాగే, ఇప్పటికే చేపట్టిన పనులను నిరంతరాయంగా కొనసాగించాలని, పనుల్లో జాప్యం చేయవద్దని ఆదేశించారు. జిల్లాలో 165 పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు అనుమతులు జారీ చేసినట్లు చెప్పారు. అలాగే, 274 పశువులకు చికిత్స చేసే ట్రైవీస్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 240 పనులు మంజూరు చేశామన్నారు. ఈ పనులకు మొత్తం రూ.2.35 కోట్లు వ్యయం కానుందన్నారు. అలాగే, 20 నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేశామని అన్నారు. వివిధ శాఖల అధికారులు శ్రీనివాసరావు, శిరీష, సులోచనారాణి, విజేత, డేవిడ్ రాజు, తానాజీ, డాక్టర్ పురంధర్, వెంకటేశ్వరచారి పాల్గొన్నారు.