భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను అధికంగా నమోదు చేసేందుకు బడిబాట కార్యక్రమాన్ని పకడ్బదీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో సమన్వయ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే పాఠ్య, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు, డిజిటల్ విద్య, ఉపకార వేతనాలు, ఇతర ప్రోత్సాహకాల గురించి తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. 6 నుంచి 14 ఏళ్ల వయస్సు కలిగిన బడీడు పిల్లలందరినీ గుర్తించి సమీపంలోని పాఠశాలలకు వెళ్లే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించడానికి ఇష్టపడటం లేదో అందుకు గల కారణాలను కూడా అధికారులు నమోదు చేయాలన్నారు.
జిల్లావ్యాప్తంగా రానున్న రెండు వారాల్లో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను గుర్తించి.. వాటికి తగిన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం ద్వారా జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలకు మట్టి ఇటుకలతో ప్రహరీల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. రానున్న ఐదు రోజుల్లో ఏకరూప దుస్తుల తయారీ పూర్తి చేసి అన్ని పాఠశాలలకు అందించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, సీపీవో సంజీవరావు, మెప్మా పీడీ రాజేశ్, డీఈవో వెంకటేశ్వరాచారి, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఇందిర, మహిళా, శిశు సంక్షేమాధికారి స్వర్ణలత లెనీనా, జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.