భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ జూలూరుపాడు, ఆగస్టు 22: అర్హులందరికీ రుణ మాఫీ అవుతుందని, మాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తున్నామని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా జూలూరుపాడు మండలం చింతల్‌తండా గ్రామానికి గురువారం ఆయన వెళ్లారు. అక్కడ మునగ మొక్కలను నాటి రైతులతో చర్చించారు. అయితే చింతల్‌తండా రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదంటూ ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల ప్రచురించిన కథనంపై స్పందించిన ఆయన.. ఆ అంశంపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీపై ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదని, అర్హులకు రుణమాఫీ అవుతుందని, గ్రామంలో అర్హుల పేర్లను పరిశీలిస్తానని అన్నారు. రుణమాఫీ రాని వారి నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్నామని, ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తనకు చెప్పాలని అన్నారు. అలాగే, గతంలో రుణమాఫీ అయిన రైతులకు కొత్త రుణం ఇవ్వడం లేదని కొందరు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
జూలూరుపాడు మండలం చింతల్‌తండా, బేతాళపాడు, రేగళ్లతండా, మాచినేనిపేటతండా, కరివారిగూడెం, కొమ్ముగూడెం గ్రామాల్లో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ గురువారం ఆకస్మికంగా పర్యటించారు. ‘నాటుదాం ఒక చెట్టు.. అమ్మ కోసం’ కార్యక్రమంలో భాగంగా చింతల్‌తండాలో మునగ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా అక్కడ సాగవుతున్న మునగ పంటను పరిశీలించి రైతులను అభినందించారు. కొమ్ముగూడెంలో శిథిలావస్థకు చేరిన పశువైద్యశాలను పరిశీలించారు. వెంటనే ఆ భవనాన్ని తొలగించి నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. జడ్పీ సీఈవో విద్యాచందన, ఏపీడీ రవి, ఎంపీడీవో కరుణాకర్‌రెడ్డి, ఎంపీవో తులసీరాం, ఏపీవో రవి తదితరులు పాల్గొన్నారు.