భద్రాద్రి కొత్తగూడెం, మే 22 (నమస్తే తెలంగాణ) : వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు రోడ్ల వెంట ఇంకుడు గుంతల నిర్మాణాలు విరివిగా చేపట్టాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ‘జల్ సంచయ్ జన్ భాగిదారి’ కార్యక్రమంలో భాగంగా రహదారుల వెంట ఇంకుడు గుంతల నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యల గురించి సంబంధిత అధికారులతో గురువారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
రోడ్ల వెంట ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. రానున్న వర్షాకాలంలో వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకే విధంగా ఇంకుడు గుంతల నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు. నిర్మించిన ప్రతీ ఇంకుడు గుంత ఫొటోను ‘జల్ సంచయ్ జన్ భాగిదారి’ పోర్టల్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
26 నుంచి సర్వేయర్లకు శిక్షణ
భూభారతి ప్రక్రియలో భాగంగా భూ సర్వే కోసం లైసెన్స్ సర్వేయర్లుగా ఎంపికైన వారికి ఈ నెల 26 నుంచి జూలై 26వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. కొత్తగూడెం మైనింగ్ కాలేజీలో శిక్షణ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. 426 మంది అభ్యర్థులకు 50 రోజులపాటు పనిదినాల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు.
ఉదయం 9 గంటలకు క్షేత్రస్థాయిలో శిక్షణ, 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు థియరీ, ప్రాక్టికల్స్ ఉంటాయని పేర్కొన్నారు. శిక్షణ కోసం అవసరమైన ప్రొజెక్టర్లు, బోర్డులు తదితర పరికరాలన్నీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఉమ్మడి జిల్లా మైనింగ్ కాలేజీ ఏడీ శ్రీనివాస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మైనింగ్ కాలేజీ సిబ్బంది ఉన్నారు.