భద్రాచలం, జనవరి 31: ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా గిరిజన కుటుంబాల కోసం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆకాంక్షించారు. భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్‌తో కలిసి తన చాంబర్లో యూనిట్ అధికారులతో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీసీసీ ద్వారా గిరిజనులు సేకరించే కరక్కాయ, ఇప్పపూలు, ఔషధ గుణాలు కలిగిన గింజలు కొనుగోలు చేయడమే కాకుండా..
వాటిని మార్కెటింగ్ చేసుకునేలా ప్రతీ డీఆర్డీఏలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి వారే సొంతంగా అమ్ముకునేలా యంత్రాలు సమకూరుస్తామని పేర్కొన్నారు. దీనిపై గిరిజన మహిళలకు శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. గిరిజన యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు పొందేలా చూడాలని, జాబ్ కార్డు హోల్డర్లకు ఈజీఎస్ ద్వారా 100 రోజుల పని కల్పించాలన్నారు. సమావేశంలో ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఆర్సీవో గురుకులం నాగార్జునరావు, డీటీఆర్వోఎఫ్ఆర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ కార్యాలయంలోని క్యాంపస్ పరిసరాలను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పరిశీలించారు. ఐటీడీఏ పక్కన మైదానంలో వర్షపు నీరు చేరకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. సందర్శకులు సేదతీరడానికి పక్కనే ఉన్న పార్కును, ఐటీడీఏ క్యాంటీన్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలన్నారు. అనంతరం రాశివనం పార్కు, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, పీఎంఆర్సీ కార్యాలయం, నాప్కిన్, మిల్లెట్ బిస్కెట్ యూనిట్, కోయ బొమ్మల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు.