చుంచుపల్లి, మే 5 : రైతులు పంటల సాగులో యూరియా వాడకం తగ్గించాలని, అవసరం మేరకు రసాయన, పురుగు మందులను పిచికారీ చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా మెరుగైన సాగు పద్ధతులపై జిల్లా రైతులకు అవగాహన కల్పించే దిశగా సోమవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని చేపట్టారు.
పెనగడప గ్రామంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నేల సారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ రైతుపై ఉన్నదని, విచ్చలవిడిగా రసాయనాలు వాడితే నేల సారం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. సాగుకు ముందే పంట మార్పిడి దిశగా రైతులు ఆలోచన చేయాలని, మునగ, ఆయిల్‌పామ్, వెదురు లాంటి లాభదాయక పంటలు వేసుకోవాలన్నారు.
ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల వైపు రైతులు ఆసక్తి చూపాలని, సాగు ద్వారా ఆదాయం పెంపొందించుకునేందుకు కేవీకే శాస్త్రవేత్తల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ, శాస్త్రవేత్తలు బి.శివ, కొత్తగూడెం ఏడీఏ నరసింహారావు, చుంచుపల్లి ఏవో రాజేశ్వరి, ఏఈవో మమత, పంచాయతీ సెక్రటరీ, రైతులు పాల్గొన్నారు.