కొత్తగూడెం టౌన్, ఆగస్టు 28 : నిరంతరం క్రీడల సాధనతో ఆరోగ్యవంతంగా ఉంటారని, ఎలాంటి అలసట లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం క్రీడా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. క్రీడలతో శరీర దృఢత్వం, స్నేహభావం ఏర్పడుతుందని, వయసుతో నిమిత్తం లేకుండా క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించవచ్చన్నారు.
అనంతరం ఉద్యోగులకు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, త్రోబాల్, చెస్, మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్, టగ్ ఆఫ్ వార్, 100 మీటర్ల వాక్, పరుగుపందెం పోటీలు నిర్వహించారు. డీవైఎస్వో పరంధామరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.