భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ జూలూరుపాడు, మార్చి 6 : అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం అన్నిశాఖల జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా ప్రాజపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై సమీక్షించారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలకు కేటాయించిన పనులను సమగ్ర ప్రణాళికతో అమలుచేసే లక్ష్యాలను సాధించాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, వైద్యారోగ్య సేవల విస్తరణ, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కోతులు, వీధికుక్కల సమస్యలను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి 24గంటల కంట్రోల్ రూమును ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు.
వ్యవసాయశాఖ ద్వారా రైతులకు యూరియా ఎరువుల సమర్ధ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా జూలూరుపాడు పంచాయతీ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పంచాయతీ సర్పంచ్ ఏవరని స్థానిక ఎంపీడీవోను అడగడంతో కోర్టు ఆర్డర్‌తో ఎన్నిక నిలిచిపోయిందని తెలిపారు. అనంతరం పంచాయతీ పరిసరాలను పరిశీలించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు. వారివెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో పూరేటి అజయ్, ఎంపీవో తులసీరామ్, పంచాయతీ కార్యదర్శి ఖాదర్ ఉన్నారు.