గోదావరి తీరం నుంచి కనులారా వీక్షించిన భక్తజనం ‘జై శ్రీరాం.. జైజై శ్రీరాం’ అంటూ హర్షధ్వానాలు హంసాలంకృత తెప్పపై స్వామివారి జల విహారం.
ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాచలం, డిసెంబర్ 29 : గౌతమీ తీరాన భక్తజనులు శ్రీరామస్మరణ చేస్తుండగా భద్రాచలం పట్టణంలో శ్రీసీతారామచంద్రస్వామి జల విహారం నేత్రపర్వంగా కొనసాగింది. తెలుగు రాష్ర్టాల నుంచి తరలివచ్చిన భక్తజనం గోదావరి కరకట్ట, ఇసుక తిన్నెలపై ఎదురుచూస్తూ జై శ్రీరాం.. జైజై శ్రీరాం అంటూ హర్షధ్వానాలు చేస్తుండగా.. బాణసంచా మోతల నడుమ వైభవోపేతంగా సాగింది.
ఏటా ముకోటి ఏకాదశి పర్వదినం ముందు రోజు గోదావరి నదిలో హంసాలంకృత తెప్పపై సీతారామ చంద్రస్వామిని విహరింపజేయడం ఆనవాయితీ. సోమవారం సాయంత్రం 4 గంటలకు శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం నుంచి సీతారామచంద్ర లక్షణ స్వాములను అందంగా అలంకరించిన పల్లకిలో భాజాభజంత్రీలు, మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాటాల నడుమ గోదావరి నదికి తీసుకొచ్చారు.
హంసాలంకృత తెప్పపై స్వామివారిని ఆసీనులను చేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, వేద పఠనం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక ప్రసాద నివేదన గావించారు. హంస వాహనం చుట్టూ బలిహరణం(పొంగలి) వేశారు. గోదావరి నదిపై అరుణ వర్ణ కాంతి వెదజల్లుతుండగా సీతారామచంద్రస్వామి వారు హంసాలంకృత లాంచీలోకి అలంకరించిన విద్యుద్దీప కాంతులతో మరింత శోభాయమానంగా దర్శనమిచ్చారు.
పండితుల వేద పఠనం, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని గోదావరి నదిపై విహరింపజేయడం, మరోవైపు బాణసంచా మోతలతో నదీ తీరం హోరెత్తించింది. ఐదు పర్యాయాలు హంసాలంకృత తెప్పపై స్వామివారి జల విహారం చూడముచ్చటగా కొనసాగింది. తర్వాత స్వామివారు గోదావరి నుంచి భద్రాద్రి రామాలయానికి బయలుదేరారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, దేవస్థానం ఈవో కె.దామోదరరావు, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు వైదిక సిబ్బంది పాల్గొన్నారు.